మీ దీక్షలు ఎందుకు : నిరంజన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేస్తున్న దీక్షపై తెలంగాణ రాష్ట్రా వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో రైతులు పండించిన పంటను వంద శాతం కొంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణలో మాదిరిగా కొనుగోళ్లు జరుగుతున్నాయని నిరూపిస్తారా అని ప్రశ్నించారు ?. పిడుగులు పడడం, వర్షాలు రావడం ప్రకృతిపరంగా జరుగుతున్నదే .. అది ప్రకృతి సహజం .. అది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు .. ఈ విషయంలో రైతులకు ఉన్న స్పష్టత బీజేపీ నేతలకు లేకపోవడం విచారకరం అని అన్నారు. పిడుగుల మీద వితండవాదం చేయడం బీజేపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. 12,500 గ్రామపంచాయతీలకు పంటల సాగును పరిగణనలోకి తీసుకొని 7077 ధాన్యం, 1027 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదించాం. 5187 ధాన్యం, 923 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. పంటల కోతలను బట్టి కొనుగోలుకేంద్రాలను పెంచుకుంటూ పోవడం జరుగుతుంది తెలిపారు. పిడుగులు, అకాలవర్షాలకు రైతులు రైతులు ఇబ్బందిపడడం అనేది విచారకరం .. దానిని రాజకీయం చేయడం బాధాకరం .. చనిపోయిన రైతు కుటుంబానికి భీమా సొమ్ము అందించడం జరిగింది.. తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొనడం జరుగుతుంది చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో గత ఆరేళ్లలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్ధ్యం 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు, సాగునీటి రాకతో సాగువిస్తీర్ణం పెరుగుతుందని కొనుగోలు కేంద్రాలు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల విషయంలో పూర్తి అవగాహనతో ఉంది, బీజేపీ నేతలు కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తే అదే వారు తెలంగాణకు చేసే పెద్దమేలు అన్నారు. రైతుల పట్ల మీకు ప్రేమ, బాధ్యత ఉంటే పసుపుబోర్డు సాధించండి.. మద్దతుధరకు పండిన పూర్తి పంటల కొనుగోలుకు అనుమతులు సాధించుకుని రండి హితవు పలికారు. సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో నైరాశ్యంలో ఉన్న తెలంగాణ రైతులలో ఆత్మవిశ్వాసం నింపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే, అసలు తెలంగాణ తెచ్చుకున్నదే రైతుల సమస్యలను రూపుమాపేందుకు, తెలంగాణ రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకునే కేంద్రం ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్న విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి అని అయన అన్నారు.