దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్.. హైదరాబాద్‌లో
ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆన్‌లైన్‌ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఐక్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్‌డీవో ఈ ల్యాబ్‌ను తయారుచేసింది. కరోనా పరీక్షలతోపాటు, వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీపై ఈ ల్యాబ్ పనిచేయనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గబ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నామని వెల్లడించారు. కోవిడ్-19 చికిత్స కోసం ఎనిమిది ప్రత్యేక హాస్పిటళ్లను ఏర్పాటుచేశామని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలుచేస్తున్నామని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.