దాంట్లో అమెరికానే ముందుంది
అమెరికా ప్రపంచ దేశాలను తన గుప్పిటిలో పెట్టుకోగల దేశం. అయితే ఆ దేశం ఇప్పుడు కరోనా బారినపడి చిన్న చిన్న దేశాలు సైతం వేలు ఎత్తి చూపించుకునేలా తయారైంది. ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రాంప్ కారణమని సొంత పార్టీలోని వారే పెదవి విరుస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు 41.8 లక్షల మందికి కరోనా పరీక్షలను నిర్వహించినట్టు ట్రంప్ వెల్లడించారు. భారతదేశంతో సహా పది దేశాల కంటే అమెరికానే ఎక్కువ కరోనా పరీక్షలను నిర్వహించినట్టు అయన తెలిపారు. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా ఈ రికార్డ్‌ను అధిగమించలేదన్నారు. ఫ్రాన్స్, యూకే, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, ఇండియా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, స్వీడన్, కెనడా దేశాల గురించి ట్రంప్ ముఖ్యంగా ప్రస్తావించారు. మరోపక్క అమెరికా కరోనాను చాకచక్యంగా అదుపు చేయగలుగుతోందంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా వ్యాప్తంగా లక్ష మంది కరోనా కారణంగా మృతిచెందుతారని అంచనా వేశామని ట్రంప్ అన్నారు. అయితే ప్రస్తుత పురోగతిని బట్టి చూస్తే ఈ సంఖ్య 60 వేలకు పరిమితం అయ్యే అవకాశం ఉందన్నారు.
కాగా, ట్రంప్ ప్రకారం.. ఇటలీ, స్పెయిన్‌ల కంటే అమెరికానే ముందుగా ఆంక్షలను విధించింది. ఆంక్షలను ముందుగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి లక్షల సంఖ్యలో మరణాలు ఉండేవని ట్రంప్ తెలిపారు. ఫెడరల్ ప్రభుత్వం గవర్నర్లతో కలిసి చక్కగా పనిచేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. కొంత మంది గవర్నర్లను మాత్రం ఎప్పటికి ఆకట్టుకోలేమంటూ పరోక్షంగా న్యూయార్క్ గవర్నర్‌పై విమర్శలు చేశారు. ఆఖరికి వ్యాక్సిన్ కనుగొన్నా ఆ గవర్నర్లను సంతృప్తి పరచలేమని, వారంతా ఏదో ఒక రకంగా విమర్శలు చేయడానికే ప్రయత్నిస్తారన్నారు. కాగా, అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 7,70,981 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 40 వేలకు పైగా మృత్యువాత పడ్డారు.