వన్య ప్రాణులను కాపాడుకుందాం

ఓ వైపు లాక్ డౌన్, మరోవైపు ఎండలు పెరుగున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉంటూ అడవులు, వన్యప్రాణులను రక్షించుకోవాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అడవుల్లో కార్చిచ్చు నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని, అగ్నిప్రమాదాల నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తెలుపారు. సోమవారం గచ్చిబౌలిలోని తన నివాసంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అగ్నిప్రమాదాలు గతంతో పోల్చితే ఈ యేడు తగ్గాయని సమావేశంలో PccF వెల్లడించారు. అగ్నిప్రమాదాల నివారణకు అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అడవుల్లో సోలార్‌ బోర్ల ద్వారా చిన్న చిన్న గుంతలు, చెక్‌డ్యామ్‌లు, సాసర్ల పిట్స్ లో నీటిని నింపేలా చ‌ర్య‌లు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూపార్క్ లు, కవ్వాల్‌, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఉన్న జంతువులు అనారోగ్యం బారిన ప‌డ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. జూ లోని జంతువుల‌కు సుర‌క్షిత‌మైన అహారాన్ని అందించాల‌న్నారు. బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేష‌న్ లో పెంచుతున్న మొక్క‌లకు వేసవిలో నీటి కొర‌త లేకుండా చూడాల‌న్నారు. ఇందులో ప‌ని చేసే కూలీల‌కు ఆహారం సరఫరా చేసేందుకు త‌గిన‌ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అన్నార్థులకు ఆహార పొట్లాలు పంపిణీ చేయాల‌ని దేవాదాయ శాఖ అధికారుల‌కు ఆదేశించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించడం వల్ల పేదలు, వలస కూలీలు, నిరాశ్రయులెవరూ ఆకలితో ఉండరాదని, వారికి ఆయా ఆల‌యాల్లో ఆహార పోట్లాల‌ను పంపిణీ చేయాల‌ని దేవాదాయ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. ఆల‌యాల్లో అన్న ప్రసాదాలు తయారు చేయించి అన్నార్ధుల‌కు పంపిణీ చేయాల‌ని, దీనికి సంబంధించి ఈవోలు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.
ఈ స‌మావేశంలో పీసీసీఎఫ్ (HoFF) ఆర్. శోభ‌, అడిష‌న‌ల్ పీసీసీఎఫ్ స్వ‌ర్గం శ్రీనివాస్, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.