రియల్ ఎస్టేట్ ఇప్పటికీ చాలా ముఖ్యమైన అసెట్ క్లాస్: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్
కరోనా వ్యాధి, లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా రియల్టీ సెక్టార్ విపరీతంగా నష్టపోతోందని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. స్థిరాస్తుల ధరలు 20 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిజానికి రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాల్సి ఉందని, రాబోయే కాలంలో అదే జరగబోతోందని అన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. నరెడ్కో వంటివి ధరలు 15 శాతం వరకు తగ్గుతాయంటున్నాయని, నిజానికి ఇది 20 శాతం వరకు ఉండొచ్చని స్పష్టం చేశారు. ‘‘ఉద్యోగ భద్రత ఉన్న వాళ్లు, అదనంగా డబ్బు ఉన్న వాళ్లు ఇల్లు కొనడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ ఇప్పటికీ చాలా ముఖ్యమైన అసెట్ క్లాస్. అయితే ఇండియా రియల్టీ ఇది వరకే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. లిక్విడిటీ లేకపోవడం, ఎన్‌పీఏలు పెరగడం వల్ల ఈ రంగానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రభుత్వం అందుబాటు ధరల గృహాలకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నా, మాంద్యం వల్ల గిరాకీ తగ్గింది. రియల్టర్లు మారటోరియంపై ఆధారపడకుండా ఈక్విటీల ద్వారా నిధులు సమకూర్చుకోవాలి’’ అని ఆయన వివరించారు. కరోనా వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ డిమాండ్ బాగా తగ్గుతుందని స్టడీ రిపోర్టులు చెబుతున్నాయి.