గ్రామీణ ప్రాంతాల్లోని.. రెక్కాడితే డొక్కాడని..
ఆటోవాలాల ఆకలి తీరుస్తున్న మంత్రి హరీశ్..!

నియోజకవర్గంలో 3వేల పైచిలుకు ఆటో కార్మికులకు అండ.!

  • 100 రోజుల ఉపాధి కల్పిస్తామని ఆటోవాలాలకు భరోసా
  • 312 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ

సిద్ధిపేట, ఏప్రిల్ 16: రెక్కాడితే కానీ, డొక్కాడని ఆటోవాల కుటుంబాలకు మంత్రి హరీశ్ బాసటగా నిలిచారు. కరోనా వ్యాధి ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉన్నదని., లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట సీసీ గార్డెన్స్ లో గురువారం మధ్యాహ్నం గ్రామీణ ప్రాంతాల్లోని 312 మంది ఆటోవాలా కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్స్ సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దాదాపు 3వేల పైచిలుకు మంది రోజూ రెక్కాడితే కానీ డొక్కాడని ఆటోవాలలకు ప్రభుత్వం, తానూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో దినసరి కష్టజీవులైన ఆటోవాలలు అవసరమైన వారు ఉపాధి హామీ కింద 100 రోజులకు పని కల్పిస్తామని, మీకు కావాల్సిన ఉపాధి హామీ జాబ్ కార్డులను ఆయా గ్రామాల సర్పంచ్ లు అందిస్తారని మంత్రి వెల్లడించారు. మీరంతా ఖాళీగా ఉండకుండా ప్రభుత్వం పని కల్పిస్తుందని, ఆ దిశగా అవసరం ఉన్నవారు ముందుకొస్తే మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీ కోసం తనవంతు సాయంగా ఇతోధికంగా నిత్యావసర సరుకుల కిట్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్‌తో అగ్రదేశాలు సైతం అతలాకుతలం అవుతున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌ పొడిగించారని చెప్పారు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ పోలీసులు, వైద్యులకు ప్రజలు సహకరించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, చిన్నకోడూర్ మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.