మైన‌స్ 3 శాతానికి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం: ఐఎంఎఫ్ వార్నింగ్‌

కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ‌దేశాలు స్తంభించిపోయాయి. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కూడా కుప్ప‌కూల‌నున్నాయి. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాది మైన‌స్ మూడు శాతానికి ప‌డిపోనున్న‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ అంచ‌నా వేసింది.  ఇది 2008-09లో వ‌చ్చిన ఆర్థిక సంక్షోభం క‌న్నా దారుణంగా ఉన్న‌ట్లు త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. ఈ ఏడాది రెండ‌వ అర్థ‌భాగంలో మ‌హమ్మారి నుంచి కొంత విముక్తి ఉన్నా.. ప్ర‌గ‌తి అంత‌గా క‌నిపించ‌డంలేద‌ని ఐఎంఎఫ్ చీఫ్ ఎకాన‌మిస్ట్ గీతా గోపినాత్ తెలిపారు. 

అయితే ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిర‌ప‌డిన త‌ర్వాత 2021లో ఆర్థిక వృద్ధి 5.8గా సాగుతుంద‌ని ఐఎంఎఫ్ అంచ‌నా వేసింది.  ఆర్థిక ప‌త‌నం కొన్ని కీల‌క రంగాల‌పైనే ఉన్న కార‌ణంగా.. విధాన‌క‌ర్త‌లు ప‌లు ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని ఐఎంఎఫ్ ఎకాన‌మిస్ట్ గీతా తెలిపారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో కూరుకుపోయిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఇది 1930లో వ‌చ్చిన గ్రేట్ డిప్రెష‌న్ క‌న్నా దారుణంగా ఉంద‌న్నారు. అగ్ర‌దేశాల లాక్‌డౌన్ చ‌ర్య‌లను ఐఎంఎఫ్ మెచ్చుకున్నా.. ఆర్థిక ప‌త‌నం నుంచి ఆ దేశాల‌ను ఎవ‌రూ  కాపాడ‌లేర‌న్నారు.