రైతులకు అండగా ప్రభుత్వం : ఎర్రబెల్లి

కూలీల‌ను రైతుల‌తో అనుసంధానం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. కూలీలతో రైతాంగానికి త‌ప్ప‌నిస‌రి ప‌నులుంటాయి. ఆయా కూలీలో సగం మాత్ర‌మే రైతు భ‌రించే విధంగా, మిగ‌తా స‌గం కూలీని ఉపాధి హామీ కింద అందేలా చేయాల‌ని భావిస్తున్నాం. రైతుకు స‌గం కూలీ లాభం కాగా, కూలీల‌కు ఉపాధి ల‌భిస్తుంది. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గారు ప్ర‌ధాన మంత్రి నరేంద్ర‌మోదీతో మాట్లాడారు. ప్ర‌ధాని సానుకూలంగా స్పందించారు. కేంద్రం నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యం, మ‌క్క‌జొన్న‌ల‌కు మూడు రోజుల్లోనే బిల్లులు రైతుల‌కు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.* అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అలాగే వ‌రంగ‌ల్ లో గ‌న్నీ బ్యాగుల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి కూడా సీఎం అంగీక‌రించార‌ని తెలిపారు. మంత్రి ఎర్ర‌బెల్లి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సోమ‌వారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం మ‌ల‌క‌ప‌ల్లి, ఐన‌వోలు మండ‌లం సింగారం గ్రామాల్లో ధాన్యం, మ‌క్క‌జొన్న‌ల కొనుగోలు కేంద్రాల‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ యార్డు ఎనుమాముల‌లో వ‌డ్డీ ర‌హిత రుణాల‌కు సంబంధించిన చెక్కుల‌ను రైతుల‌కు అంద‌చేశారు. ఆయా సంద‌ర్భాల‌లో మంత్రి ఎర్ర‌బెల్లి రైతుల‌నుద్దేశించి మాట్లాడారు.

కరోనా నేప‌ధ్యంలో కూలీలు ప‌నిలేకుండా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే రైతాంగం కూడా పంట‌లు పండించి అమ్ముకునే ప‌రిస్థితి లేక దిక్కుతోచ‌ని స్థితిలోపడ్డారు. ప్ర‌స్తుతం ధాన్యం, మ‌క్క‌ల కొనుగోలు ప్ర‌భుత్వ‌మే చేప‌ట్టింది. ఆఖ‌రి గింజ వ‌ర‌కు ప్ర‌భుత్వం రైతుల పంట‌ల‌ను కొనుగోలు చేస్తుంది. అయితే, కూలీల‌ను ఆదుకోవ‌డానికి సిఎం కెసిఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నార‌న్నారు. ఉపాధి హామీ ప‌థ‌కం కేంద్ర ప‌రిధిలో కావ‌డంతో ప్ర‌ధాన మంత్రి నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఇదే విష‌యం మొన్న జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలోనూ చ‌ర్చించామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు.

రైతుల నుంచి ధాన్యం, మ‌క్క‌జొన్న‌ల కొనుగోలు కోసం ప్ర‌భుత్వం అనేక వ్య‌య‌ప్ర‌యాసాల‌కోరుస్తున్న‌ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. స‌రిపోను గోదాములు లేక‌పోవ‌డంతో రాష్ట్రంలోని ఫంక్ష‌న్ హాల్స్ ని తీసుకుని వినియోగిస్తున్నామ‌న్నారు. గ‌న్నీ బ్యాగుల కొర‌త‌ను తీర్చ‌లేని విధంగా ఉంద‌ని, అయితే, సిఎం కెసిఆర్ గారు ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీతో మాట్లాడి గ‌న్నీ బ్యాగులు తెప్పించార‌న్నారు. అయితే, గ‌న్నీ బ్యాగుల త‌యారీ కేంద్రం కేవ‌లం బెంగాల్ లోనే ఉంద‌ని, ఇప్పుడు ఆ బ్యాగుల త‌యారీ కేంద్రాన్ని రాష్ట్రానికి తెచ్చేందుకు అటు సీఎం కెసిఆర్ గారు, ఇటు ప‌రిశ్ర‌మ‌ల మంత్రి కెటిఆర్ గారు సంబంధిత పారిశ్రామిక‌వేత్త‌తో మాట్లాడార‌ని మంత్రి తెలిపారు. ఆ గ‌న్నీ బ్యాగుల త‌యారీ కేంద్రాన్ని వ‌రంగ‌ల్ లో ఏర్పాటు చేయ‌డానికి సీఎంగారు అంగీక‌రించార‌ని రైతులు, ప్ర‌జాప్ర‌తినిధుల హ‌ర్ష ధ్వానాల మ‌ధ్య మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌క‌టించారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో జ‌రిగిన చ‌ర్చ‌లో తన కోరికను మ‌న్నించిన సీఎం గారికి, కెటిఆర్ గారికి ఎర్ర‌బెల్లి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే, మామునూరు లేదా మ‌డికొండ‌ల్లో గ‌న్నీ బ్యాగుల త‌యారీ కేంద్ర ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి తెలిపారు.