కొత్త కేసులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి: ఐసీఎంఆర్.
- విదేశీ ప్రయాణ చరిత్ర లేకపోయినా కరోనా లక్షణాలు
- 104 కేసుల్లో 40 కేసులు ఇలాంటివేనన్న ఐసీఎంఆర్
- మూడో దశకు చేరుకుంటోందని అనుమానాలు
- అలాంటిదేమీ లేదన్న కేంద్రం
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి దేశంలో కరోనా వ్యాప్తి రెండో దశలోనే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతుండగా, కొత్త కేసులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంటోంది.
విదేశీ ప్రయాణ చరిత్ర లేకపోయినా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, వారు కరోనా వ్యక్తులను కలిసిన దాఖలాలు కూడా లేవని, అయినప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతోందని ఐసీఎంఆర్ వివరించింది. శ్వాస సంబంధ వ్యాధి ఉన్నవారికీ కరోనా సోకుతున్నట్టు వెల్లడైందని తెలిపింది. 104 కేసుల్లో 40 వరకు ఇలాంటి కేసులే ఉన్నాయని, దేశంలో కరోనా విస్తరణ మూడో దశకు చేరుకుంటోందన్న అనుమానాలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విభేదిస్తోంది. అలాంటిదేమీ లేదని, 3వ దశకు వస్తే ముందుగానే హెచ్చరిస్తామని ప్రకటించింది.