దేశవ్యాప్తంగా 8 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,356కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,367. వ్యాధి నుంచి రికవరీ అయి డిశ్చార్జీ అయినవారు 715 మంది. ఒకరు విదేశీయుడు. కాగా కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో 273 మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 909 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 34 మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు 1,761 కేసులు నమోదు కాగా 127 మంది మృత్యువాతపడ్డారు. 13 రాష్ర్టాల ముఖ్యమంత్రులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంల అభిప్రాయాల మేరకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించనున్నట్లు ప్రధాని పేర్కొన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్రం తొలిసారిగా మార్చి 25న లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే ఆర్థికవ్యవస్థను కాపాడటంపై దృష్టిసారించనుంది. అదేవిధంగా కరోనాను నియంత్రిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సమర్థవంతమైన చర్యలను కొనసాగించనుంది.