చిన్న షేర్లు చితికిపోయాయ్‌..

మార్చిలో స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీల్లో 30 శాతం వరకు క్షీణత
కరోనా భయాలతో మార్కెట్లో భారీ పతనమే కారణం

కోవిడ్‌-19 సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా మన మార్కెట్లు నేలచూపులు చూశాయి. ఈ నష్టాలతో ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు కరువైంది. మార్కెట్‌ పతనంతో లక్షల కోట్ల రూపాయల నష్టాలు మిగిలాయి. పెద్ద పెద్ద కంపెనీల షేర్లే కరోనా దెబ్బతో నేలకరిచాయి. ఇక చిన్న కంపెనీల షేర్లు చితికిపోయాయి. గత మార్చి నెలలో బీఎ్‌సఈలోని స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు 30 శాతం వరకు పతనమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ఇది ప్రపంచ మాంద్యానికి దారితీస్తుందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అందుకే పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న షేర్లను అమ్మకానికి పెట్టారు. దీని ఫలితమే మార్కెట్లలో చరిత్రాత్మక పతనాలు. మార్చిలో స్మాల్‌ క్యాప్‌ సూచీ 29.90 శాతం క్షీణించి 4,100.09 పాయింట్లకు చేరింది. ఇదే నెలలో బీఎ్‌సఈ సూచీ సెన్సెక్స్‌ 23 శాతం (8,828.8 పాయింట్లు) నష్టాన్ని మూటగట్టుకుంది. ‘‘కరోనా వైరస్‌ మూలంగా ఎదురైన సవాళ్లతో గత నెలలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వీటి మాదిరిగానే భారత ఈక్విటీ మార్కెట్లు భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. మార్చిలో నిఫ్టీ 23 శాతం నష్టపోయింది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ తన నివేదిక పేర్కొంది.