ప్రీమియం చెల్లింపులకు మరింత గడువు: ఎల్‌ఐసీ
మార్చి, ఏప్రిల్ నెల ప్రీమియం బకాయిల చెల్లింపులకు 30 రోజుల గడువు ఇస్తున్నట్టు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) శనివారంనాడు ప్రకటించింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రీమియంల గరిష్ఠ కాలపరిమితి మార్చి 22 తర్వాత ముగుస్తుంది. వీటికి ఏప్రిల్ 15 వరకు సడలింపు ఇచ్చారు. ఎల్‌ఐసీ పాలసీదారులు ఎల్‌ఐసీ డిజిటల్ పేమెంట్ సదుపాయాల ద్వారా ఎలాంటి సర్వీస్ చార్జీ చెల్లించకుండా ప్రీమియం చెల్లింపులు చేయవచ్చని సంస్థ తెలిపింది. తమ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే కొన్ని వివరాలు అందించడం ద్వారా ప్రీమియం చెల్లింపులు నేరుగా చేయవచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ‘ఎల్‌ఐసీ పే డైరెక్ట్’ను డౌన్‌లోడ్ చేసుకుని కూడా ప్రీమియంను చెల్లించవచ్చని తెలిపింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతోపాటు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, భీమ్, యూపీఐ తదితరాల ద్వారానూ చెల్లింపులు చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఇదిలా ఉంటే.. కరోనాతో మృతి చెం దిన 16 మంది పాలసీదారుల క్లెయిమ్‌లను చెల్లించినట్టు తెలిపింది.