సూపర్ మార్కెట్లో దగ్గిన మహిళ సుమారు 26లక్షల రూపాయలు విలువ కలిగిన ఆహార పదార్థాలను పారేశారు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకి ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వైరస్ ధాటికి చిగురుటాకులా విలవిలలాడుతోంది. ఈ పరిస్థితికి అద్దం పట్టె సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగింది.

అక్కడ స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు ఓ మహిళ వచ్చింది. అక్కడ ఉన్న ఆహార పదార్థాలపై కావాలని దగ్గింది. దీన్ని చూసిన కొందరు సిబ్బంది.. ఆ మహిళను వెంటనే సూపర్ మార్కెట్ నుంచి బయటకు పంపేశారు. ఆ తర్వాత సూపర్ మార్కెట్‌లో ఆమె ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడ శుభ్రం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సూపర్ మార్కెట్ యజమాని.. ఆ మహిళ దగ్గిన ఆహార పదార్థాలను గుర్తించి వాటన్నింటినీ పారేశారు.
అంత ఆహారం పారేసినందుకు బాధగా ఉన్నా తప్పలేదని సూపర్ మార్కెట్ యజమాని తెలిపారు. ఆ ఆహారం విలువ సుమారు 35వేల డాలర్లు(సుమారు 26లక్షల రూపాయలు) ఉంటుందని సూపర్ మార్కెట్ యజమాని తెలిపారు. ఆ మహిళను అధికారులు కరోనా పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లారు. ఇలాంటి సంఘటన హైదరాబాద్‌లోనూ జరిగింది. మాదాపూర్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లోకి ఓ వ్యక్తి మాస్క్ లేకుండా వచ్చాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా కష్టమర్లు మాస్కు లేని వ్యక్తిని బయటికి పంపించారు.