‘భీమ్ ఫర్ రామరాజు’ సర్‌ప్రైజ్ వీడియో
‘భీమ్ ఫర్ రామరాజు’ సర్‌ప్రైజ్ వీడియో వచ్చేసింది. సర్‌ప్రైజ్ గిఫ్ట్ అని దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకన్నాడో ఆ వీడియో చూస్తే అర్థమైంది. అతని మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రామరాజుగా రామ్‌చరణ్ కనిపించిన తీరు అమోఘం. ఒక అసాధారణ శక్తిమంతుడిగా ఆ పాత్రను ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్)లో యస్.యస్. రాజమౌళి చూపిస్తున్నాడని అర్థమైపోయింది. వీడియోలో రామరాజు పాత్రను భీమ్ పాత్రధారి అయిన తారక్ పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసింది. తెలుగుతో పాటు ఈ సినిమా విడుదలవుతున్న ఇతర భాషలు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీలోనూ రామరాజు క్యారెక్టర్ ఇంట్రోను రిలీజ్ చేశారు.ఆడు నిలబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే యేగుసుక్క ఎగబడినట్టుంటది. ఎదురువడితే సావుకైనా సెమట ధార కడతది. పాణమైనా, బందూకైనా వానికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు” అని రామరాజు పాత్రను పరిచయం చేశాడు కొమరం భీమ్. తెలంగాణ యాసలో భీమ్‌గా రామ్‌చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తుంటే ఒళ్లు గగుర్పొడిచిందంటారే.. అలాగే అనిపించింది. మొన్న ఉగాది రోజు ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించనప్పుడే రామరాజు పాత్రను నిప్పుగా, భీమ్ పాత్రను నీరుగా పరిచయం చేశాడు రాజమౌళి. “నా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు” అంటూ ఆ పాత్రను భీమ్ పరిచయం చేసినదాన్ని బట్టి సినిమాలో రామరాజును భీమ్ అన్నగా సంబోధిస్తాడని అర్థమవుతోంది.