కిమ్స్ ఐకాన్ లో బాలుడికి ఏడు శస్త్రచికిత్సలు
ఘోరమైన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, దాదాపుగా కాలు తీసేయాల్సిన పరిస్థితికి చేరుకున్న ఏడేళ్ల బాలుడికి.. విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యులు ఆ కాలు మొత్తాన్ని పునర్నిర్మించి, సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. శ్రీకాకుళానికి చెందిన నవీన్ అనే బాలుడిని ఒక మినీట్రక్కు ఢీకొట్టింది. దాంతో అతడి ఎడమ కాలు తీవ్రంగా గాయపడింది. ఎముకలు బయటకు రావడం, రక్తనాళాలు కూడా బాగా దెబ్బతినడం, కొంత మేర ఎముక పూర్తిగా నలిగిపోవడం లాంటి పరిస్థితులు ఉండటంతో స్థానికంగా ఒకరిద్దరు వైద్యుల వద్దకు వెళ్లినా, కాలు తీసేయాల్సి వస్తుందనే చెప్పారు. అలాంటి పరిస్థితిలో విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి ఆ బాలుడిని తీసుకొచ్చారు. దాదాపు ఆరేడు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత.. ఆ బాలుడు ఇప్పుడు తన సొంత కాళ్ల మీద నడుస్తూ, స్కూలుకు కూడా వెళ్లగలుగుతున్నాడు. అతడికి ఎదురైన సమస్యలు, చేసిన శస్త్రచికిత్సల వివరాలను కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ట్రామా సర్జన్, లింబ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ డాక్టర్ పి.సిద్దార్థ్ తెలిపారు.
‘‘శ్రీకాకుళానికి చెందిన ఆ బాలుడిని ఒక మినీ ట్రక్కు ఢీకొట్టడం, అతడి కాలి మీద నుంచి వెళ్లిపోవడంతో కాలు తీవ్రంగా గాయపడింది. ఎముకలు బయటకొచ్చాయి, కొంతమేర ఎముక చిట్లిపోయింది. ప్రధాన రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాలి మడమ కూడా తీవ్రంగా గాయపడి, దాదాపు 20 శాతం వరకు పాడైంది. ప్రమాదం జరిగిన 12 గంటల వరకు అతడిని శ్రీకాకుళంలోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడకు వెళ్లినా ఎముకలు కొంతమేర చిట్లిపోవడంతో మోకాలి కింది భాగాన్ని తీసేయాల్సి ఉంటుందనే చెప్పారు. కానీ, బాలుడి వయసు దృష్ట్యా తల్లిదండ్రులు మరొక్క ప్రయత్నం చేద్దామనుకుని విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ కాలు పునర్నిర్మించే చికిత్స ఉందని తెలియడంతో ఇక్కడివరకు వచ్చారు. రాగానే అతడిని పరీక్షిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రమాదం జరిగి అప్పటికే 12 గంటలు దాటడంతో కొంతమేర ఇన్ఫెక్షన్ కూడా వ్యాపించింది. దాంతో అసలు ఏం చేయగలమన్న అంచనా వేసుకుని ఆర్థోపెడిక్ వైద్య విభాగంతో పాటు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పీఆర్‌కే ప్రసాద్‌ను కూడా సంప్రదించాం. ముందుగా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చికిత్స ప్రారంభించాం. తొలిదశలో పూర్తిగా పాడైన, చిట్లిపోయిన ఎముకలను తీసేశాం. కాలి మడమ కూడా తీవ్రంగా దెబ్బతిని, ఆ ఎముక కూడా విరగడంతో వాటన్నింటికీ చికిత్సలు చేశాం. మొదటిదశలో బోన్ డీబ్రిడ్‌మెంట్ చేశాం. అంటే.. ఈ ప్రక్రియలో ముందుగా పాడైన ఎముక కణజాలాన్ని పూర్తిగా తీసేసి, తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేశాం. తర్వాత రెండోదశలో బాగున్న కుడి కాలి నుంచి కొంత కణజాలాన్ని, కండరాలను తీసుకుని, వాటిని ఎడమకాలిలో అమర్చాం. ఇదంతా నయం కావడానికి, ఇన్ఫెక్షన్ పూర్తిస్థాయిలో తగ్గడానికే దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. ఆ తర్వాత లింబ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ (ఎల్ఆర్ఎస్) చేశాం. అప్పుడు ఎముక ఎదిగేలా చేశాం. ఇందుకోసం లోపలి భాగంలో క్లాంపులు, క్లిప్పులు అమర్చాం. దాంతో మొత్తం 4 సెంటీమీటర్ల మేర కొత్తగా ఎముక ఎదిగింది. అది ఏర్పడిన తర్వాత క్లిప్పులు, క్లాంపులు, ఎల్ఆర్ఎస్ తీసేశాం. దగ్గరకు వచ్చిన తర్వాత ఎముక అతుక్కోవడం మొదలైంది. దీనికి ప్రమాదం జరిగినప్పటినుంచి 8 నెలలు పట్టింది. అయితే, మధ్యలో కరోనా కూడా తీవ్రంగా ఉండటంతో మూడు నాలుగు నెలల పాటు అతడికి సర్జరీలు చేయలేకపోయాం. ఆ సమయంలో స్థానికంగా ఉండే ఒక ఆర్ఎంపీ అతడి సంరక్షణ బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు. అతడికి ఎప్పటికప్పుడు ఇక్కడినుంచి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి, బాలుడిని జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఆ తర్వాత మళ్లీ విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తీసుకొచ్చి, అవసరమైన ప్లాస్టిక్ సర్జరీలు చేశాం. దాదాపు ఏడాదిన్నర పాటు ఇలా ఆ బాలుడు మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పుడు అతడికి అన్నిరకాల శస్త్రచికిత్సలు పూర్తికావడంతో ఇటీవలే నడిపించాం. సుదీర్ఘకాలం తర్వాత ఆ బాలుడు తన సొంతకాళ్ల మీద నడవగలడంతో ఎంతగానో సంతోషించాడు. అతడి తల్లిదండ్రులు కూడా ఆనందబాష్పాలు కార్చారు. ఈ కేసులో ప్రధాన రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిని రక్తప్రసారం దాదాపు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు పక్కన ఉండే చిన్న కొలరల్స్ నుంచి రక్తప్రసారం ఉండటంతో పోయిన ఎముకను ఎదిగేలా చేయడం, కండరాలు, కణజాలాలను పక్క కాలి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినా అవి ఇక్కడ అమరడం సాధ్యమైంది. ఇప్పుడు అతడు స్వయంగా, ఎలాంటి ఆసరా లేకుండా నడుస్తూ, స్కూలుకు కూడా వెళ్తున్నాడు’’ అని డాక్టర్ పి. సిద్దార్థ్ వివరించారు.