సోమాలియా రైతుకు అమోర్ ఆస్ప‌త్రిలో కొత్త జీవితం

  • పాదం, తుంటి, తొడ‌, పొత్తి క‌డుపులో గాయంతో తీవ్రంగా ఇన్ఫెక్ష‌న్‌
  • సొంత దేశంలో గాయ‌ప‌డి, వైద్యం కోసం ప‌లు దేశాలు తిరిగిన రోగి
  • ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్‌లో స‌రైన చికిత్స‌

అమోర్ ఆస్ప‌త్రిపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం పెరుగుతోంది. కేవ‌లం స్వ‌దేశంలోని వారే కాదు.. దేశ‌విదేశాల నుంచి కూడా రోగులు స‌రైన చికిత్స కోసం ఇక్క‌డ‌కే వ‌స్తున్నారు. అత్యంత నైపుణ్యంతో కూడిన చికిత్స‌ల‌తో పాటు విజ‌య‌వంత‌మైన శ‌స్త్రచికిత్స‌లు జ‌రుగుతాయ‌న్న న‌మ్మ‌కం ఉండ‌టంతో ఇలా వ‌చ్చేవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది.

ఇలాగే తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల‌తో 53 ఏళ్ల వ‌య‌సుగ‌ల వ్య‌క్తి ఎక్క‌డో సోమాలియా నుంచి రెక్క‌లు క‌ట్టుకుని హైద‌రాబాద్ వ‌చ్చారు. ఇలాంటి సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌ల‌ను విజ‌య‌వంతంగా చేయ‌డంలో డాక్ట‌ర్ కిశోర్ బి.రెడ్డికి ఉన్న పేరు, నైపుణ్యం గురించి తెలుసుకుని, ఇక్క‌డ‌కు వ‌చ్చారు.

సోమాలియాకు చెందిన రైతు హుస్సేన్ అబిద్ అలీ తీవ్రమైన నొప్పి, కాలి వాపుతో ఆస్ప‌త్రికి వ‌చ్చారు. దానికితోడు ఆయ‌న తుంటి భాగం నుంచి చీము కారుతోంది. ఆయ‌న పొలంలో ప‌ని చేసుకుంటున్న‌ప్పుడు జారిప‌డ‌టంతో ఒక రాయి ఆయ‌న కాలిని చీల్చేసింది. దానివ‌ల్ల ఆయ‌న పాదంలో తీవ్రంగా ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ ఏర్ప‌డింది. అది క్ర‌మంగా కుడి తొడ‌కు, పొత్తిక‌డుపులోకి కూడా పాకింది. త‌న సొంత దేశంలో చికిత్స‌ల త‌ర్వాత ఆయ‌న కెన్యా వెళ్లారు. కానీ అక్క‌డ కూడా త‌న స‌మ‌స్య‌లు ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో అప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చారు.

తొలుత న‌గ‌రంలో ఒక‌టి రెండు ఆస్ప‌త్రులు తిరిగారు. ఆయ‌న‌కున్న స‌మ‌స్య‌ల తీవ్ర‌త‌, వాటికి చికిత్స చేయ‌డానికి అవ‌స‌ర‌మైన వ‌న‌రులు, నైపుణ్యం లేక‌పోవ‌డంతో వారు ఆయ‌న్ని చేర్చుకోలేదు. అప్పుడు అమోర్ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ కిశోర్ బి. రెడ్డి వ‌ద్ద‌కు అబిద్ అలీ వ‌చ్చారు. ఆయ‌న‌కున్న‌స‌మ‌స్య‌, అందించిన చికిత్స గురించి డాక్ట‌ర్ కిశోర్ రెడ్డి ఇలా వివ‌రించారు.

‘‘ఆయ‌న గ‌జ్జ‌ల నుంచి చీము కారుతున్న‌ట్లు గ‌మ‌నించాం. దాంతోపాటు కుడి పాదం నల్ల‌గా మారిపోయింది. ఆయ‌న మూడేళ్ల నుంచి ఇలాగే నొప్పి భ‌రిస్తున్నారు. అమోర్ ఆస్ప‌త్రికి వ‌చ్చేస‌రికి న‌డ‌వ‌డం కూడా క‌ష్టంగా ఉంది. ఆయ‌న పాదం, తుంటి భాగం, తొడ‌, పొత్తిక‌డుపు అన్నీ తీవ్రంగా ఇన్ఫెక్ష‌న్‌కు గుర‌య్యాయి. త‌గిన ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత ఆయ‌న‌కు కుడికాలు, పొత్తిక‌డుపులో చ‌ర్మంతో పాటు క‌ణ‌జాలంలో తీవ్ర‌మైన ఇన్ఫెక్ష‌న్‌.. అంటే యూమిసెటోమా ఏర్ప‌డింద‌ని గుర్తించాం. అది క్ర‌మంగా లింఫాటిక్ వ్య‌వ‌స్థ గుండా వ్యాపించి పాదం నుంచి పొత్తిక‌డుపు వ‌ర‌కు వెళ్లింది. ఆయ‌న పెల్విక్ ఎముక‌ను ఆ ఇన్ఫెక్ష‌న్ తినేసింది. దాంతో గ‌జ్జ‌ల నుంచి దుర్వాస‌న‌తో కూడిన చీము కారుతోంది’’ అని తెలిపారు.

ముందుగా పొత్తిక‌డుపు, పాదం నుంచి ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ తొలగించేందుకు చాలా క‌ష్ట‌మైన డిబ్రైడ్‌మెంట్ చేయాల్సి వ‌చ్చింద‌ని డాక్ట‌ర్ కిశోర్ రెడ్డి తెలిపారు. శ‌స్త్రచికిత్స చేసిన వైద్య‌బృందం అత్యంత నైపుణ్యంతో, ముందుగా ప్ర‌ధాన ర‌క్త‌నాళాల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తీశారు. ఈ ర‌క్త‌నాళ‌మే కుడి కాలికి ర‌క్త‌స‌ర‌ఫ‌రా చేస్తుంది.

‘‘శ‌స్త్రచికిత్స త‌ర్వాత ఇన్ఫెక్ష‌న్ తగ్గ‌డంతో, పొత్తిక‌డుపు ప్రాంతంలోకి నెగెటివ్ ప్రెష‌ర్ వూండ్ థెర‌పీని ఉప‌యోగ‌గించి యాంటీబ‌యాటిక్స్ ఉన్న ఆస్టియో ఇంటిగ్రేటింగ్ సిమెంట్ బీడ్స్ పంపాం. పాదంలోని మృదు క‌ణ‌జాలాన్ని రివ‌ర్స్ సూర‌ల్ ఆర్టెరీ ఫ్లాప్‌తో పున‌ర్నిర్మించాం. ఇప్పుడు అబిద్ అలీకి ఇన్ఫెక్ష‌న్ పూర్తిగా త‌గ్గ‌డంతో పాటు అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు న‌య‌మై ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు’’ అని డాక్ట‌ర్ కిశోర్ రెడ్డి తెలిపారు.

త‌న‌కు స‌రికొత్త జీవితాన్ని ప్ర‌సాదించినందుకు డాక్ట‌ర్ కిశోర్ రెడ్డికి, అమోర్ ఆస్ప‌త్రి వైద్య‌బృందానికి హుస్సేన్ అబిద్ అలీ, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.