జగన్ మౌనమేలా – మోడీ
సొంత చెల్లిని ఇబ్బంది పెడితే కనీసం స్పందించలేదు అని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి, కేసీఆర్ సర్కారుపై పోరాడుతున్న సొంత చెల్లెలు షర్మిలపై దాడి జరిగినా… హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినా… ఆమె కూర్చుని ఉండగానే కారును క్రేన్‌తో లాక్కెళ్లి ఠాణాకు తరలించినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఈ సంఘటనలను ఖండించలేదు. కానీ… ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఆ విషయం తెలిసి నాకే బాధ కలిగింది. ఇంత జరిగినా మీరెందుకు మాట్లాడలేదు?’ అని నేరుగా జగన్‌నే ప్రశ్నించారు. దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక… జగన్ తనదైన శైలిలో నవ్వుతూ మౌనంగా నిల్చున్నట్లు తెలిసింది. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వాహనంపై వరంగల్ జిల్లా నర్సంపేటలో గత ఆదివారం రాళ్ల దాడి జరిగింది. అక్కడే ఆమె క్యారవాన్‌కు నిప్పంటించారు. పోలీసులు ఆమెను బలవంతంగా హైదరాబాద్‌లోని నివాసానికి తరలించారు. ఆ మరుసటి రోజున… దీనిపై ప్రగతి భవన్ ముందే నిరసన వ్యక్తం చేస్తానంటూ ధ్వంసమైన కారు, క్యారవాన్‌తో సహా బయలుదేరారు. కారును ఆమెనే నడుపుతూ ముందుకు కదిలారు. షర్మిలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆమె కూర్చుని ఉండగానే కారును క్రేన్‌తో (టోయింగ్) లాక్కెళ్లి స్టేషన్‌లో కూర్చోబెట్టారు. షర్మిలను పరామర్శించేందుకు వెళ్తున్న తల్లి విజయలక్ష్మిని కూడా పోలీసులు నిలువరించారు. దాదాపు రోజంతా జరిగిన ఈ వరుస పరిణామాలు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. షర్మిల రాజకీయ కార్యకలాపాలతో తమకు సంబంధంలేదని… వ్యక్తిగతంగా మాత్రం ఇది బాధాకరమని అదే రోజున ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతకుమించి దీనిపై వైసీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు.