కరోనా వైరస్ మానవ సృష్టే… అమెరికా శాస్త్రవేత్త

ప్రపంచవ్యాప్తంగా మానవాళి పాలిట మహమ్మారిలా విజృంభించిన కొవిడ్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని చైనా ఇప్పటిదాకా చెబుతూ వస్తోంది. కానీ అది అవాస్తవం అనీ, కరోనా వైరస్ ప్రయోగశాలలో సృష్టించిన వైరస్ అని అమెరికా పరిశోధకుడు ఆండ్రూ హఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వుహాన్ లో చైనా ప్రభుత్వం వైరస్ పరిశోధన కేంద్రం నిర్వహిస్తుండడం తెలిసిందే. కరోనా వైరస్ మొట్టమొదటగా వెలుగు చూసింది ఈ వుహాన్ నగరంలోనే. అయితే ఇది జంతు, సముద్ర ఉత్పత్తుల మాంసం విక్రయించే మార్కెట్ నుంచి వ్యాపించి ఉంటుందని చైనా అప్పట్లో పేర్కొంది. 

అయితే, ప్రముఖ పరిశోధకుడు ఆండ్రూ హఫ్ తాజాగా ది ట్రూత్ ఎబౌట్ వుహాన్ పేరిట ఓ పుస్తకం తీసుకువచ్చారు. ఇందులో సంచలన విషయాలు వెల్లడించారు. వుహాన్ ల్యాబ్ నుంచే కొవిడ్ వైరస్ లీకైందని తెలిపారు. ఆ ల్యాబ్ లో తగిన భద్రత ప్రమాణాలు లేవని, నిర్వహణ లోపం కూడా ఉందని వివరించారు.

అయితే చైనాలో కరోనా తరహా ప్రమాదకర వైరస్ ల అభివృద్ధికి అమెరికా కూడా నిధులు అందించిందని ఆయన ఆరోపించారు. కొవిడ్ వైరస్ ను జన్యుపరంగా మార్పులు చేసి అభివృద్ధి చేసిన విషయం చైనాకు ముందే తెలుసని ఆండ్రూ హఫ్ తన పుస్తకంలో తెలిపారు. 

ఇలాంటి హానికర జీవాయుధాన్ని చైనాకు బదిలీ చేసినందుకు అమెరికా ప్రభుత్వాన్ని నిందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వుహాన్ ల్యాబ్ లో ప్రాణాంతక జీవాయుధంతో పనిచేస్తున్నామని తెలిశాక హడలిపోయానని వెల్లడించారు.

ఆండ్రూ హఫ్ ఎకోహెల్త్ అలయన్స్ అనే పరిశోధక సంస్థకు గతంలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఈ సంస్థ వుహాన్ ల్యాబ్ కు పలు పరిశోధనల్లో సహకారం అందించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆండ్రూ హఫ్ ను ఉటంకిస్తూ పాశ్చాత్య మీడియాలో కథనాలు వచ్చాయి.