కోవిడ్ తర్వాత పెరిగిన ఊపిరితిత్తుల మార్పిడి – డా. సందీప్ అత్తావర్

కోవిడ్19 మహామ్మారి తర్వాత ఊపిరితిత్తుల మార్పిడి గణణీయంగా పెరిగిందన్నారు ఇండియన్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ (ఐఎన్ఎస్‌హెచ్ఎల్‌టీ) అధ్యక్షుడు డా. సందీప్ అత్తావర్. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో జరుగుతున్న జాతీయ సదస్సును కిమ్స్ హాస్పిటల్ ఛైర్మన్ డా. భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సదస్సు ప్రపంచలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారు.

ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి, మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ లాంటి అంశాలకు సంబంధించిన క్లిష్టమైన వైద్య రంగాలపై చర్చకు ఈ సమావేశం ఏర్పాటైంది. అలానే, ఇటీవలి కాలంలో వైద్యరంగంలో జరిగిన కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలపైనా దృష్టి సారించింది. ఈ కార్యక్రమం కేవలం మన దేశంలోని వైద్యులకే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరికీ సమాన ప్రాధాన్యం కలిగినదే.

గుండె వైఫల్యం, తుది దశ ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన కేసులు ప్రమాదకర స్థాయిలో పెరగడంతో, వాటికి చికిత్సలు చేసేటప్పుడు ఈ ఆవిష్కరణలు ఎంతో ఉపయుక్తమని వక్తలు ప్రశంసించారు. వైద్యులు, కార్డియో థొరాసిక్ సర్జన్లు, అవయవ మార్పిడి నిపుణులు అత్యుత్తమ వైద్యం అందించడానికి, వేలాది విలువైన ప్రాణాలు కాపాడటానికి ఈ సమావేశం ఎలా సహాయపడుతుందో వారు లోతుగా చర్చించారు.

ఇండియన్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ (ఐఎన్ఎస్‌హెచ్ఎల్‌టీ) అధ్యక్షులు, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ సందీప్ అత్తావర్ ప్రధానంగా థొరాసిక్ ట్రాన్స్ ప్లాంటేషన్, దానిపై కొవిడ్-19 ప్రభావానికి సంబంధించిన వివిధ అంశాలను బాగా వివరించారు. “కొవిడ్-19 మహమ్మారి ప్రారంభదశ చాలా కష్టతరంగా నడిచింది. ఇప్పటివరకు వినని పాథాలజీ స్వభావం, దాని అతితీవ్రమైన స్వభావం వల్ల చాలా క్లిష్టమైన, ప్రాణాలను కాపాడే రెండు-ఊపిరితిత్తుల మార్పిడి సర్వసాధారణం అయిపోయింది. వైద్యులు ఎంత మంచి ప్రయత్నాలు చేసినా, అవయవదానం మన దేశంలో చాలా తక్కువగా ఉంది. ఇది ఈ సమస్యకి అదనంగా తోడైంది. ఈ రోజు, మూడు సంవత్సరాల తరువాత, వైద్యులుగా మేము ఎన్నో భరించి, అసాధారణమైన నైపుణ్యంతో ముందుకు సాగామఅని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. చివరి దశ గుండె, ఊపిరితిత్తుల వ్యాధిని అర్థం చేసుకోవడంలో మేం చాలా సాధించాము. అలానే, ప్రాణాలను రక్షించే ఎక్స్ ట్రా-కార్పోరియల్ బ్రిడ్జింగ్ వ్యూహాలను ఉపయోగించడం, మొత్తం సమాజ ఆరోగ్యంపై దృష్టి పెంచడం లాంటివి ఈసమయంలో సాధించిన విజయాలు.”

“ఈ విషయంలో నేను మన దేశానికి సంబంధించిన కొన్ని గణాంకాలను ప్రస్తావించాలనుకుంటున్నాను. ప్రస్తుత అవసరాలను బట్టి చూస్తే, మన దేశంలో ఏడాదికి కనీసం నాలుగు లక్షల అవయవ మార్పిడులు అవసరం. దురదృష్టవశాత్తు, అవయవదానాల్లో కేవలం 0.5% శాతం మాత్రమే బ్రెయిన్ డెత్ తర్వాత వస్తున్నాయి. అవయవ దానాలు చాలా తక్కువగా ఉన్నందున ఈ మార్పిడులు పెద్దగా జరగడం లేదు. సంవత్సరానికి 60,000 గుండెలు మార్చాల్సి ఉన్నా.. మనం గరిష్ఠంగా 250 వరకు మాత్రమే చేయగలుగుతున్నాము. లక్ష ఊపిరితిత్తులు మార్చాల్సి ఉంటే మేము గరిష్ఠంగా 200 మారుస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలతో సహా అన్నిచోట్లా డిమాండు ఎల్లప్పుడూ సరఫరా కంటే ఎక్కువగా ఉన్నా.. మన దేశంలో అవయవదానాల్లో భారీ పెరుగుదల అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి నుంచి ప్రతి సంవత్సరం సుమారు 20,000 అవయవదానాలు జరగచ్చు. చాలా మంది అవయవాలు దొరక్క చివరిదశలో మరణిస్తున్నారు. ఈ డిమాండ్-సరఫరా అంతరాన్ని మనం భర్తీచేయాలి. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవ దానానికి ఉన్న ప్రాముఖ్యత గురించి వైద్యరంగానికి చెందిన వారు, మీడియా కూడా అవగాహన పెంచుకోవాలి. ఈ స్ఫూర్తి ఆగస్టు సమావేశానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మంచి నిపుణులు బ్రెయిన్-స్టార్మింగ్ సెషన్లలో తమ అనుభవాలు, దృక్పథాలను పంచుకుంటున్నప్పుడు సాధించిన లాభాల నుంచి తెలుసుకోవడం చాలా సంతోషకరం” అన్నారు.

ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారు తమ సృజనాత్మక ఆలోచనలను పంచుకున్న విధానం, నిపుణులు పంచిన ప్రాక్టికల్ అనుభవాలతో ఎంతో నేర్చుకున్నారు. భవిష్యత్తులో రోగులకు చికిత్స చేసేటప్పుడు వారు పొందవలసిన పరిజ్ఞానం, వారు పొందవలసిన ప్రాక్టీసుతో వీరంతా సంతోషించారని వేరే చెప్పనవసరం లేదు.