92 ఏళ్ల వృద్ధురాలికి 10 నిమిషాల్లో స్టెంట్ అమరిక
- ఏపీలోనే మొట్టమొదటిగా గుర్తింపు
పెద్దవయసు వారికి.. అంటే సాధారణంగా 75 ఏళ్లు దాటినవారికి స్టెంట్లు వేయడం సాంకేతికంగా చాలా సంక్లిష్టం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 92 ఏళ్ల వృద్ధురాలికి అనంతపురం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కేవలం 10 నిమిషాల వ్యవధిలో అత్యవసరంగా స్టెంట్ అమర్చి, ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ వివరాలను ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ మూడే సందీప్ వివరించారు.
‘‘అనంతపురం జిల్లా పాపంపేట ప్రాంతానికి చెందిన 92 ఏళ్ల వృద్ధురాలు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తీవ్రమైన ఆయాసం, గుండెనొప్పితో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రికి వచ్చారు. వెంటనే ఆమెకు గుండెకు సంబంధించిన పరీక్షలు చేయగా తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, బీపీ చాలా తక్కువగా ఉందని తెలిసింది. వెంటనే వెంటిలేటర్ పెట్టి తగిన చికిత్స చేసి బీపీని అదుపులోకి తీసువచ్చాం. అనంతరం యాంజియోగ్రామ్ చేసి చూడగా, ఎడమవైపు రక్తనాళం 100% మూసుకుపోయింది. దీంతో ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమెకు స్టెంట్ అమర్చాము. దాంతో రెండు రోజుల తర్వాత గుండె పంపింగ్ పెరిగి, రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఎప్పటికప్పుడు మందులు వాడుతూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈమె నిండు నూరేళ్లు బతికే అవకాశం ఉంటుంది.
90 ఏళ్లు దాటినవాళ్లకు ఇలా స్టెంట్ వేయడం ఏపీలో ఇదే తొలిసారి. ఇంతకుముందు 88 ఏళ్లవారికి అమర్చారు. అసలు 75 ఏళ్లు దాటిన తర్వాత స్టెంట్ వేయడం చాలా కష్టం. అప్పటికే మన శరీరంలో వయసు సంబంధిత మార్పులు చాలా జరుగుతాయి. రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోవడం వల్ల అవి గట్టిబడిపోతాయి. అందువల్ల వాటిలో స్టెంట్లు వేయడం చాలా సంక్లిష్టం. స్టెంట్ వేసేటప్పుడుచాలా రకాల ఇబ్బందులు వస్తాయి. రక్తనాళాలు గట్టిబడిపోవడం వల్ల లోపలకు వెళ్లాక స్టెంట్ తెరుచుకోకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు రోగి చనిపోవచ్చు కూడా. కానీ కిమ్స్ సవీరాలో ఉన్న అత్యాధునిక సదుపాయాల వల్ల ఎంతటి సంక్లిష్టమైన కేసులనైనా చేస్తున్నాము.
65 దాటిన తర్వాత జాగ్రత్తలు అవసరం
సాధారణంగా ఎవరైనా 65 సంవత్సరాల వయసు దాటిన తర్వాత తప్పనిసరిగా ప్రతియేటా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ, 2డి ఎకో లాంటి పరీక్షలు చేయించుకుంటే చాలావరకు సమస్యలు తెలుస్తాయి. అప్పుడు అత్యవసర పరిస్థితి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నయం చేయించుకోవచ్చు. ఇబ్బంది ఉన్నా, లేకున్నా ఏడాదికోసారి పరీక్ష చేయించుకోవాలి.
గుండె చికిత్సలు ఏవైనా అత్యవసరంగా చేయాలి. అందుకు 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన ఇలాంటి సంక్లిష్టమైన కేసులనూ పూర్తి విజయవంతంగా చేయడానికి వైద్యులు అందుబాటులో ఉండటం, అత్యాధునిక సదుపాయాలు ఉండటమే కారణం’’ అని డాక్టర్ మూడే సందీప్ వివరించారు.