ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో కేసీఆర్ అలెర్ట్

హుటాహుటిన ప్రగతిభవన్ రావాలని మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు పిలుపు

హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్‌ సహా.. తెలంగాణలోని పలు గ్రానైట్‌ పరిశ్రమల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపన్ను శాఖ(ఐటీ) ముప్పేట దాడులు చేశాయి. బుధవారం ఉదయం నుంచి ఈ రెండు శాఖలు సంయుక్తంగా మంత్రి నివాసం సహా.. హైదరాబాద్‌, కరీంనగర్‌లలో సోదాలు నిర్వహించాయి. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రగతిభవన్కు కేసీఆర్ పిలిపించారు. కేంద్రం ఇదే తంతు కొనసాగిస్తే చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు చేశారు.

కరీంనగర్‌ లోని మంత్రి గంగుల నివాసంతోపాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మంత్రి గంగులకు సంబంధించిన శ్వేతా గ్రైనేట్స్‌లో డైరెక్టర్లుగా ఉన్న మంత్రి సోదరులు గంగుల సుధాకర్‌, వెంకన్నతోపాటు బోనాల శ్రీనివాస్‌, రాజేశం, పొన్నమనేని గంగాధర్‌ రావు, మహిపాల్‌ రెడ్డితోపాటు మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మంత్రి గంగుల ఇంటికి తాళం ఉండడంతో.. ఆయన పీఏను పిలిపించిన ఈడీ, ఐటీ అధికారులు.. తాళాన్ని పగులగొట్టి.. లోనికి వెళ్లారు. తనిఖీలు నిర్వహించారు.

అలాగే హైదరాబాద్‌ సోమాజిగూడ గ్రానైట్‌ వ్యాపారి శ్రీధర్‌ నివాసం, పంజగుట్టలోని పీఎస్‌ఆర్‌ గ్రానైట్‌ సంస్థ కార్యాలయం, హైదర్‌గూడ అత్తాపూర్‌లోని జనప్రియా హితోపియా అపార్ట్‌మెంట్‌లోని అరవిందో గ్రానైట్స్‌ వ్యాపారి వెంకటేశ్వరరావుకు చెందిన కార్యాలయం, హిమాయత్‌నగర్‌లోని పలు గ్రానైట్‌ సంస్థల కార్యాలయాల్లో ఈడీ, ఐటీ బృందాలు సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. ఎస్‌వీజీ-2 గ్రానైట్‌ భాగస్వామి రవీందర్‌రావు, కరీంనగర్‌ కమాన్‌ సమీపంలో నివాసముంటున్న గ్రానైట్‌ వ్యాపారి అరవింద్‌ వ్యాస్‌, ఎస్‌వీజీ-1 గ్రానైట్‌ యజమాని వేణుగోపాల్‌ కార్వా నివాస గృహాల్లోనూ, కరీంనగర్‌లోని గ్రానైట్‌ క్వారీలతోపాటు మంకమ్మతోట, కమాన్‌ చౌరస్తా, బావుపేట తదితర ప్రాంతాల్లో ఉన్న ఆయా గ్రానైట్‌ క్వారీ సంస్థల కార్యాలయాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దాడులు చేశాయి..