క‌స్ట‌డిలో బోయిన‌ప‌ల్లి అభిషేక్‌

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్​రావును సీబీఐ అరెస్ట్​ చేసింది. మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడికి రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. కేసులో తమకు సహకరించడం లేదని, తప్పు దోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని సీబీఐ అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించింది. లిక్కర్​ స్కామ్​లో రాష్ట్రం నుంచి అరెస్టయిన తొలి వ్యక్తి అభిషేక్​రావే. ఇదే వ్యవహారంలో 12 రోజుల కింద ముంబైకి చెందిన విజయ్​నాయర్​ను సీబీఐ అధికారులు అరెస్టు చేయగా.. ఆ మరుసటిరోజే ఢిల్లీకి చెందిన సమీర్​ మహేంద్రును ఈడీ అధికారులు అరెస్టు చేశారు.


బోయినపల్లి అభిషేక్‌‌ రావును ఆదివారం రాత్రి హైదరాబాద్ కూకట్​పల్లిలోని ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం అరెస్టు చేసి.. ట్రాన్సిట్‌‌ వారెంట్‌‌పై ఢిల్లీకి తరలించారు. లిక్కర్‌‌‌‌ కేసులో నిందితుడిగా చేర్చి సీబీఐ స్పెషల్‌‌ కోర్టు జడ్జి ఎమ్ కే నాగ్‌‌పాల్ ముందు సోమవారం మధ్యాహ్నం ప్రొడ్యూస్‌‌ చేశారు. అనుమానాస్పద లావాదేవీల వివరాలు రాబట్టేందుకు 5 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరారు. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో అభిషేక్​ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌లో రూ.3.85 కోట్లు అభిషేక్ రావు అకౌంట్ల నుంచి ఇండోస్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌ మహేంద్రుకు వచ్చినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ముందుగా సౌత్‌‌ లాబీ పేరుతో ఆ మొత్తం 3 అకౌంట్ల నుంచి అభిషేక్ ఖాతాల్లో జమ అయినట్లు పేర్కొంది. వీటికి సంబంధించిన వివరాలను సేకరించాల్సి ఉందని కస్టడీ పిటిషన్‌‌లో సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు.


ఢిల్లీ లిక్కర్​ కేసులో రాష్ట్రం నుంచి మొట్టమొదటి అరెస్టు జరగడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో హాట్‌‌ టాపిక్‌‌గా మారింది. ఈ కేసుతో సంబంధాలున్న రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురిని అభిషేక్​ స్టేట్​మెంట్​ ఆధారంగా త్వరలో సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయగా.. ఇందులో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కోకాపేట్‌‌‌‌‌‌‌‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నాడు. రామచంద్రపిళ్లై రాబిన్‌‌‌‌‌‌‌‌ డిస్టిలరీస్‌‌‌‌‌‌‌‌, రాబిన్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీ కంపెనీలకు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. రాబిన్​ డిస్టిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీకి బోయినపల్లి అభిషేక్‌‌‌‌‌‌‌‌రావు కూడా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌‌‌‌‌‌‌‌లో రామచంద్ర పిళ్లై ద్వారా రూ.2 కోట్ల నుంచి 4 కోట్లు చేతులు మారినట్లు సీబీఐ గుర్తించింది. ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఎండీ సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేంద్రు, ముంబైకి చెందిన విజయ్‌‌‌‌‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా లంచం డబ్బు ప్రభుత్వ అధికారులకు అందినట్లు ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే కోకాపేట్‌‌‌‌‌‌‌‌లోని రామచంద్ర పిళ్లై ఇంట్లో, నానక్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌గూడ, గచ్చిబౌలిలోని అభిషేక్‌‌‌‌‌‌‌‌ రావు ఆఫీసుల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు.


గత నెల 27, 28 తేదీల్లో ముంబైకి చెందిన విజయ్‌‌‌‌‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీబీఐ, ఢిల్లీకి చెందిన సమీర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మహేంద్రు ను ఈడీ అరెస్ట్ చేసి విచారించాయి. రామచంద్ర పిళ్లై ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను ఈ ఇద్దరి స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా రాబట్టాయి. లిక్కర్ పాలసీ మార్చేందుకు అధికారులు, లిక్కర్ వ్యాపారులు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో మీటింగ్స్ నిర్వహించినట్లు సీబీఐ గుర్తించింది. ఆ మీటింగ్​కొచ్చిన వారి డేటా కలెక్ట్ చేసింది. రామచంద్ర పిళ్లై, సమీర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మహేంద్రు స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా అభిషేక్‌‌‌‌‌‌‌‌రావును సీబీఐ విచారించింది. గతంలోనే 2నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు తెలిసింది. ఆధారాలు చూపకపోవడంతో ఆదివారం మళ్లీ విచారించినట్లు సమాచారం. సీబీఐ అధికారుల విచారణకు సహకరించకపోవడంతో ఆదివారం రాత్రి అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.


రామచంద్ర పిళ్లై ద్వారా జరిగిన లిక్కర్ డీలింగ్‌‌‌‌‌‌‌‌లో సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేంద్రుకు రూ. 3.85 కోట్లు అభిషేక్‌‌‌‌‌‌‌‌రావు నుంచి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్​ అయినట్లు సీబీఐ అనుమానిస్తున్నది. మొదట ఈ డబ్బు 3 అకౌంట్ల ద్వారా అభిషేక్‌‌‌‌‌‌‌‌ రావు ఖాతాల్లోకి చేరినట్లు, సౌత్‌‌‌‌‌‌‌‌లాబీ పేరుతో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు జరిగినట్లు గుర్తించింది. ఈ అనుమానాస్పద మూడు అకౌంట్లు ఎవరివి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది. ప్రధానంగా అభిషేక్‌‌‌‌‌‌‌‌రావు నుంచి ఢిల్లీకి చేరిన డబ్బుపై సీబీఐ ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలిసింది. లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్ జరిగిన రోజుల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ఢిల్లీకి వచ్చిన వారి వివరాలు, మీటింగ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న వారి వివరాలను సీబీఐ ఇప్పటికే సేకరించింది. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్​లో వెన్నమనేని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రావును విచారించింది. అతడి కంపెనీల నుంచి ఢిల్లీకి ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ టికెట్లు బుక్​ అయినట్లు గుర్తించి.. దాని ఆధారంగా ముందుకు వెళ్తున్నది. ఇదే క్రమంలో మరో ముగ్గురుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.


బోయినపల్లి అభిషేక్​రావు తొమ్మిది కంపెనీలకు డైరెక్టర్​గా ఉన్నాడు. రాబిన్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ ఎల్‌‌ఎల్‌‌పీ కంపెనీకి అరుణ్‌‌రామచంద్ర పిళ్లైతో పాటు అభిషేక్‌‌ డైరెక్టర్​గా కొనసాగుతున్నాడు. సికింద్రాబాద్‌‌ క్లాక్‌‌టవర్‌‌‌‌ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్‌‌లో దీని ఆఫీసులు ఉన్నట్లు రికార్డుల్లో చూపారు. కానీ అక్కడ అనూస్ బ్యూటీ పార్లర్‌‌‌‌, మాస్టర్ స్యాండ్‌‌ పేరుతో షాపులు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటికి కూడా అభిషేక్​ డైరెక్టర్​గా ఉన్నాడు. అదేవిధంగా ఎస్‌‌ఎస్‌‌ మైన్స్ అండ్ మినరల్స్, వ్యాల్యూ కేర్‌‌‌‌ ఎస్తెటిక్స్, నియోవర్స్ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, అగస్తీ వెంచర్స్, జియస్ నెట్‌‌వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అనూస్ ఎలక్ట్రోలిసిస్ అండ్ ఒబెసిటీ సంస్థలకు డైరెక్టర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీల లావాదేవీలపై ఇప్పటే ఈడీ ఆధారాలు సేకరించింది. మనీ లాండరింగ్‌‌ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. ఇదే క్రమంలో అభిషేక్‌‌రావు నుంచి ఇండో స్పిరిట్‌‌ కంపెనీ ఎండీ సమీర్‌‌‌‌ మహేంద్రుకు ముట్టిన డబ్బు ఏ అకౌంట్‌‌ నుంచి వెళ్లిందనే వివరాలపై సీబీఐ ఫోకస్ పెట్టింది. అభిషేక్‌‌ రావు ఇచ్చే స్టేట్‌‌మెంట్‌‌ ఆధారంగా సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.