ఫేస్‌బుక్ ఉద్యోగులపై వేటు
సోషల్ మీడియాలో తనకంటూ ఓ మంచి వేదికను ఏర్పాటు చేసుకుంది ఫేస్‌బుక్. అయితే ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులపై వేటు వేస్తున్నారని ప్రచరం జరుగుతోంది. త్వరలోనే భారీగా ఉద్యోగాల కోత తప్పదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు వస్తున్న నష్టాలను తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టిన ఆ సంస్థ అధినేత మార్క్ జుకెర్‌బర్గ్… ఆశించిన మేర సామర్థ్యం లేని ఉద్యోగులపై వేటు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్ పోస్ట్ కథనం మేరకు 12 వేల మందికి పైగా ఫేస్‌బుక్ ఉద్యోగులపై వేటు పడనున్నట్లు సమాచారం.
ఫేస్‌బుక్‌లో భారీగా లే ఆఫ్స్ దిశగా ఇప్పటికే జుకెర్‌బర్గ్ ఓ నిర్ణయం తీసుకున్నారని, సంస్థలోని టీం మేనేజర్లకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. మీ టీంలలో పనితీరు సరిగా లేని వారి జాబితా రూపొందించాలని, కనీసం 15 శాతం మందిని గుర్తించి నివేదికలు పంపాలని జుకెర్‌బర్గ్ మేనేజర్లను ఆదేశించినట్లు సమాచారం. మేనేజర్ల నుంచి నివేదికలు అందగానే పనితీరు సరిగా లేని ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేస్తారని, ఈ తతంగం ఒకటి, రెండు వారాల్లోనే పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే మెటాలో కొత్తగా ఉద్యోగాల భర్తీపై నిషేధం విధించిన జుకెర్‌బర్గ్… తాజాగా ఉద్యోగాల కోతపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.