బస్సు డ్రైవరుకు ఉచితంగా గుండెమార్పిడి చేసి ఐదేళ్లు
నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఒక నిరుపేద యువకుడికి ఐదేళ్ల క్రితం విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఐదేళ్లుగా పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్న ఆ యువకుడికి.. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గురువారం ఆస్పత్రి ప్రాంగణంలో సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జీచన్ దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత హాజరై, ఆస్పత్రి సేవలను ప్రశంసించారు.
నల్గొండ జిల్లా గుండ్రాంపల్లికి చెందిన లింగస్వామి అనే యువకుడు బస్సుడ్రైవరుగా పనిచేసేవాడు. 2018 సంవత్సరంలో లింగస్వామికి ఇడియోపతిక్ డైలేటెడ్ కార్డియోమయోపతి (డీసీఎంపీ) అనే సమస్య వచ్చింది. దాంతో కారణాలు ఏమీ తెలియకుండానే గుండె బాగా బలహీనపడింది. సాధారణంగా రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం 65-70% ఉంటే, ఈ వ్యాధి కారణంగా అది 25%కు పడిపోయింది. దానివల్ల ఇతర అవయవాల పనితీరు కూడా దెబ్బతినసాగింది. ఈ సమయంలో అతడిని కాపాడేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే ఏకైక మార్గం. ఇందుకు జీవన్‌దాన్ నెట్‌వర్క్ ద్వారా ప్రయత్నించగా, తక్కువ సమయానికే బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి సేకరించిన గుండె లింగస్వామికి అమర్చేందుకు లభించింది. అయితే, శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులనూ అతడు భరించగలిగే పరిస్థితిలో లేకపోవడంతో.. ఆరోగ్యశ్రీ పథకం కింద అతడికి సెంచురీ ఆస్పత్రికి చెందిన హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ నందగిరి, చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ మరియు ఆస్పత్రి వైస్ చైర్మన్ డాక్టర్ హేమంత్ కుమార్ కౌకుంట్ల కలిసి శస్త్రచికిత్స చేసి, గుండెను అమర్చారు. ఇది జరిగి ఐదేళ్లు గడిచింది. ఇప్పుడు లింగస్వామి పూర్తి ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నాడు.
ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా లింగస్వామిని ఆస్పత్రి యాజమాన్యం గురువారం ఆస్పత్రి ప్రాంగణంలో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి హాజరైన జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత లింగస్వామికి అభినందనలు తెలిపారు. అతడి జీవితం అవయవదానానికి, ఆరోగ్యశ్రీ పథకం విజయవంతం కావడానికి ప్రత్యక్ష నిదర్శనమని ఆమె చెప్పారు. నిరుపేదలకు సైతం ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా అందించడానికి ఆరోగ్యశ్రీ పథకంతో పాటు రాష్ట్రంలో సమర్థంగా అమలవుతున్న జీవన్‌దాన్ ఎప్పుడూ ముందుంటాయని చెప్పారు. ఇలాంటి పేదలకు సేవలు అందిస్తున్నందుకు సెంచురీ ఆస్పత్రి యాజమాన్యాన్ని, శస్త్రచికిత్స చేసిన వైద్యులను ఆయన ప్రశంసించారు. మరింతమందికి ఇలాంటి సేవలు అందించాలని ఆకాంక్షించారు.