చిన్నవయసులోనే గుండె జబ్బులు – అవేర్ గ్లేనీగల్స్ గ్లోబల్ వైద్యులు
మన దేశంలో ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని, అందులోనూ ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజ్‌లు చిన్నవయసు నుంచే వస్తున్నాయని అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గార్గ్ తెలిపారు. ఇవి పురుషులు, మహిళలకు సమానంగా వస్తున్నాయన్నారు. ఒక దశాబ్దం క్రితం రుమాటిక్ హార్ట్ డిసీజ్‌లు ఎక్కువగా వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్బంగా గుండె వ్యాధులకు సంబంధించిన పలు విషయాలు, వాటికి తీసుకోవల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
“మనమంతా ఫిట్‌గా ఉండాలి తప్ప ఫాట్‌గా ఉండకూడదు. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజూ 30 నిమిషాలు, వారంలో కనీసం 5 సార్లు వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మొత్తం ఆహారంలో ఇవి సగం కంటే తక్కువ ఉండాలి. క్యాలరీలను లెక్కించుకుని తింటూ, ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. ఊబకాయం వల్ల దేశం మీద పడుతున్న భారం అక్షరాలా రూ. 1.9 లక్షల కోట్లు. ఇది మన జీడీపీలో ఒక శాతం. సమాజంలో ఈ జాడ్యం పెరుగుతోంది. దీన్ని వదిలించుకోడానికి ఈ రోజుమనమంతా ప్రతిజ్ఞ చేయాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారికి రక్తపోటు 140/90లోపు ఉండాలి. మధుమేహం, కరొనరీ ఆర్టరీ డిసీజ్, నెఫ్రోపతి లాంటివి కూడా ఉంటే 130/85 ఉండాలి. టోటల్ కొలెస్టరాల్ 200లోపు, ఎల్‌డీఎల్ 100లోపు ఉండాలి. ఇవి కాక ఇంకా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్లు.. అంటే గతంలో గుండెవ్యాధులు వచ్చి ఉంటే ఎల్‌డీఎల్ 70 లోపు ఉండాలి. గుండెపోటు కూడా వచ్చి ఉంటే 60లోపే ఉండాలి. ఈ లెవెల్స్ తగినంతగా ఉండేందుకు అవసరమైతే మందులు ఉపయోగించాలి. మధుమేహం ఫాస్టింగ్ 100, పోస్ట్ లంచ్ 140 స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. 25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతియేటా సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అందులో ముఖ్యంగా షుగర్, కొలెస్టరాల్, ఈసీజీ, టీఎంటీ ఉండాలి. గుండెవ్యాధులు రాకుండా ముందే జాగ్రత్త పడాలి.