భార‌త‌దేశంలో గుండెపోటుకు ప్ర‌ధాన కార‌ణాలివే

డాక్ట‌ర్ బి.హ‌య‌గ్రీవ‌రావు
సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్టు, ఎల‌క్ట్రోఫిజియాల‌జిస్టు, కిమ్స్ ఆస్ప‌త్రి

భార‌త‌దేశంలో ఇటీవ‌లి కాలంలో గుండెపోటు ఘ‌ట‌న‌లు చాలా ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి. యువ‌త కూడా త‌ర‌చు వీటి బారిన పడుతున్నారు. భార‌తీయుల‌కు ఈ విష‌యంలో ఉండే ముప్పు కార‌ణాలు, ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో పోలిస్తే విభిన్నంగా ఉంటాయా అన్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికీ స‌మాధానం క‌చ్చితంగా దొర‌క‌ట్లేదు. ఈ విష‌యంలో లోతైన ప‌రిశోధ‌నల అవ‌స‌రం ఉంది. ఇదే అంశంపై ఇండియ‌న్ హార్ట్ జ‌ర్న‌ల్‌లో 2022 ఆగ‌స్టులో మెరిఫాక్స్ పేరుతో ఒక విస్తృత‌మైన ప‌రిశోధ‌న జ‌రిగింది. ఇందులో భార‌తీయుల‌కు గుండెపోటు ముప్పు కార‌ణాల గురించి చ‌ర్చించారు.

ఈ ప‌రిశోధ‌న విష‌యంలో.. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రిలోని సీనియ‌ర్ కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ హ‌య‌గ్రీవ‌రావు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌రిశోధ‌కుల బృందానికి నేతృత్వం వ‌హించారు. న్యూఢిల్లీ నుంచి త్రివేండ్రం వ‌ర‌కు 15 పెద్ద టెర్షియ‌రీ కార్డియాల‌జీ ఆస్ప‌త్రుల‌లో ఈ ప‌రిశోధ‌న చేశారు. రెండు సంవ‌త్స‌రాల పాటు 2,153 మంది రోగుల‌ను ప‌రిశీలించి, వారిని 1,200 నియంత్రిత జ‌నాభాతో పోల్చి చూశారు. వివిధ ఆర్థిక ప‌రిస్థితులు, ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెల‌కు సంబంధించిన విభిన్న రంగాల‌కు చెందిన రోగుల‌ను తీసుకున్నారు.

రోగుల స‌గ‌టు వ‌య‌సు 56 ఏళ్లు కాగా, వారిలో 76% మంది పురుషులు. గ‌డిచిన 20 ఏళ్ల‌లో వైద్య‌రంగం గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందినా, యువ‌త ఇప్ప‌టికీ గుండెపోట్ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఇందులో తెలిపింది. పురుషుల్లో 66% మంది, మ‌హిళ‌ల్లో 56% మందికి 60 ఏళ్ల‌లోపే గుండెపోటు వ‌స్తోంది.
పురుషులలో మూడింట ఒక వంతు, మ‌హిళల్లో నాలుగోవంతు 50 సంవత్సరాలలోపే గుండెపోటుకు గురయ్యారు. సుమారు 10% మందికి 40 సంవత్సరాలలోపు వ‌చ్చింది.

ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక ఎల్‌డీఎల్‌ కొలెస్ట‌రాల్ వంటివి గుండెపోటుకు ప్ర‌ధాన కార‌ణాల‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. ఊహించినట్లే, 93% మంది రోగులకు ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ఇతర కార‌ణాలు కూడా కొన్ని ముఖ్య‌మైన‌వే ఉన్నా.. అవి అంత ప్రాధాన్య‌మైన‌వి కావు. అవి అధిక బరువు (అధిక బాడీమాస్ ఇండెక్స్, అధిక వెయిస్ట్-హిప్ నిష్పత్తి), మధుమేహ నియంత్రణ స‌రిగా లేక‌పోవ‌డం, (అధిక ట్రైగ్లిజరైడ్స్ & హెచ్‌బీఏ1సీ), నిశ్చల జీవనశైలి, హెడ్‌డీఎల్. గుండెపోటుతో బాధపడుతున్న 95% మంది రోగులకు వీటిలో ఏవో ఒక‌టి ఉన్నాయి. ఈ ముప్పు కార‌ణాల‌ను నియంత్రించ‌డం సంప్ర‌దాయ ముప్పు కార‌ణాల నియంత్ర‌ణ‌లాగే చాలా ముఖ్య‌మ‌ని ఈ ప‌రిశోధ‌న తేల్చింది.

మూడింట ఒక వంతు మంది రోగులకు హెచ్‌బీఏ1సీ 6-6.5 మ‌ధ్య ఉంటోంది. అంటే వారు మ‌ధుమేహానికి ముందుస్థాయిలో ఉన్న‌ట్లు. అంటే, మ‌ధుమేహానికి చికిత్స ప్రారంభించడానికి ముందే గుండెపోటు నివార‌ణ‌కు చ‌ర్య‌లు ప్రారంభించాలి. భారతదేశంలో గుండెపోటును నివారించడానికి, ఊబకాయాన్ని నివారించడం, మధుమేహాన్ని క‌ఠినంగా నియంత్రించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని ఈ ప‌రిశోధ‌న‌ నొక్కి చెబుతుంది.

అధ్యయన ప్రాధాన్యం ఇదీ..
స్థూలకాయం, నిశ్చల జీవనశైలి, మధుమేహానికి స‌రైన చికిత్స చేయకపోవడం.. ఇవ‌న్నీ భారతదేశంలో గుండెపోటు నివారణ చికిత్సలో ముఖ్యమైన లోపాలు. వీటిని స‌మ‌గ్రంగా పరిష్కరిస్తే తప్ప.. భారతదేశంలోని వైద్యులు పాటించే రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్ పూర్తికాదు. వ్యక్తిగత స్థాయిలో, అధిక బరువును నివారించడానికి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. (బాడీ మాస్ ఇండెక్స్ 23-25 మ‌ధ్య‌లో ఉండాలి, వెయిస్ట్-హిప్ ఇండెక్స్ 0.9 కంటే తక్కువ ఉండాలి). ప్ర‌తియేటా లిపిడ్ ప్రొఫైల్, హెచ్‌బిఎ1సి ప‌రీక్ష‌లు చేయించుకుని మధుమేహాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. మ‌ధుమేహం ఉన్నవారు హెచ్‌బీఏ1సీ 7 లోపు ఉండేలా చూసుకోవాలి. యువ జనాభాలో గుండెపోటు వ‌స్తోంది కాబట్టి, ఈ నివారణ చర్యలను 20 సంవత్సరాల వయస్సు రావ‌డానికి ముందే ప్రారంభించాలి.

జాతీయ స్థాయిలో మ‌ధుమేహాన్ని గుర్తించ‌డానికి విస్తృతంగా ప‌రీక్ష‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కేవ‌లం బ్ల‌డ్‌షుగ‌ర్ ఒక్క‌దాన్నే కాకుండా, వీలైనంత ఎక్కువ మందికి హెచ్‌బీఏ1సీని కూడా ప‌రీక్షించి, అది 7 లోపు ఉండేలా అవ‌గాహ‌న క‌ల్పించి, నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాలి. త‌గిన ప్ర‌చారాలు చేయ‌డం ద్వారా, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాల్సిన ప్రాధాన్యం, రోజువారీ వ్యాయామాలు చేయ‌డం ద్వారా ఊబ‌కాయాన్ని నివారించి, మంచి కొలెస్ట‌రాల్ (హెచ్‌డీఎల్‌)ను పెంచుకునేలా చూడాలి.

భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులను ముందుగానే నివారించే అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. భార‌తీయుల్లో ప్ర‌మాద‌కార‌ణాలు ఏవ‌ని గుర్తించ‌డానికి స‌రైన ప‌రిశోధ‌న అవ‌స‌రం. ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు పాశ్చాత్య దేశాల్లోనే జ‌రిగిన ప‌రిశోధ‌న‌లు, వాటిలో వెలువ‌డిన మార్గ‌ద‌ర్శ‌కాల‌నే అనుస‌రించ‌డం సరిపోకపోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రమాద కారణాలను గుర్తించి, వాటిని నియంత్రించడానికి పరిష్కారాలను కనుగొనడానికి పెద్దస్థాయిలో అధ్యయనాలు చేయాలి.