తుంటి ఆర్థ్రోప్లాస్టీపై కిమ్స్ ఆసుపత్రిలో వర్క్‌షాప్
తుంటి ఆర్థ్రోప్లాస్టీ మౌలిక విధానాల (ఏబీసీ హిప్) గురించి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం సీఎంఈ వర్క్‌షాప్ జరిగింది. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టోసా), ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ (టీసీఓఎస్) సహకారంతో కిమ్స్ ఆసుపత్రి ఈ వర్క్‌షాప్‌ని నిర్వహించింది. తుంటి ఆర్థ్రోప్లాస్టీపై దేశవ్యాప్తంగా యువ ఆర్థోపెడిక్ సర్జన్లలో అవగాహన కల్పించడానికి ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సీఎంఈకి 150 మందికి పైగా యువ వైద్యులు, ఆర్థోపెడిక్ సర్జన్లు ముందుగానే పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈ వర్క్‌షాప్‌లో డా.కృష్ణయ్య, డా. ఐవీ రెడ్డి, డా.అశోక్ రాజు, డా.ప్రవీణ్ రావు, డా.ప్రవీణ్ మేరెడ్డి, డా.డి.చంద్రశేఖర్, డా.మిథిన్ ఆచి, డా.ఉదయ్ కృష్ణ, డా.పి.చంద్రశేఖర్, డా.కృష్ణ సహా సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలా ఉందనే విషయం మీద, ఇంప్లాంట్ సెలక్షన్, కప్ ప్లేస్‌మెంట్ ఆర్ట్ & సైన్స్, తుంటి ఆర్థ్రోప్లాస్టీకి విభిన్న పద్ధతుల వీడియో డెమోలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్యానెల్ డిస్కషన్లు, ఫోకస్డ్ గ్రూప్ డిస్కషన్లు జరిగాయి.
ఈ సందర్భంగా కోర్సు చైర్మన్, టీఓఎస్ఏ కార్యదర్శి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.శ్రీనివాస్ కాషా మాట్లాడుతూ, “యువ వైద్యులు అనుభవం, నైపుణ్యం ఉన్న సీనియర్ల నుంచి నేర్చుకుని, పరస్పరం సంభాషించుకోవడానికి సీఎంఈలు ఒక మంచి మార్గం. దీనివల్ల వైద్యరంగంలో నిరంతరం మారుతూ ఉండే సరికొత్త మార్పులను తెలుసుకుని రోగి సంరక్షణను మరింత మెరుగుపరచడానికి ఆచరణీయమైన మార్గాలను తెలుసుకోవడానికి అభ్యాసకులకు సహాయపడుతుంది. ఈ వర్క్‌షాప్‌కి ఇంత గొప్ప స్పందన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న కాలంలో మేము కచ్చితంగా ఇలాంటి మరెన్నో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాము” అని తెలిపారు.