దశాబ్దాల తర్వాత.. కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠంపై గాంధీయేతర వ్యక్తి..!

కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ మొగ్గు చూపడం లేదు. మరో వైపు ప్రియాంక గాంధీ సైతం అధ్యక్ష రేసులో ఉన్నా.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు సంసిద్ధంగా లేనట్లు తెలుస్తున్నది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. తమ కుటుంబానికి విధేయుడైన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తున్నది.

అయితే అశోక్‌ గెహ్లాట్‌ మాత్రం రాహుల్‌ గాంధే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే సెప్టెంబర్‌ 21 నాటికి పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం జరుగనున్నది. ఈ క్రమంలో పార్టీ వివరణాత్మక ప్రకటన చేయనున్నది. మరో వైపు సోనియా మంగళవారం రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ను ఆయన నివాసంలో కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ పగ్గాలు చేపట్టాలని గెహ్లాట్‌ను కోరినట్లు తెలుస్తున్నది. అనారోగ్య కారణాలతో పార్టీ బాధ్యతలు నిర్వహించలేనని సోనియా గాంధీ గెహ్లాట్‌తో చెప్పినట్లు తెలియవచ్చింది. సోనియా గాంధీని కలిసిన తర్వాత గెహ్లాట్ ఢిల్లీ విమానాశ్రయంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అధ్యక్షుడైన తర్వాతే పార్టీని పునర్నిర్మించగలమని తాను పదేపదే చెబుతున్నానన్నారు.

ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకుంటే నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురవుతారన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని నిరంతరం ఒత్తిడి తెస్తామన్నారు. మరో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ససేమిరా అంటే.. ఎవరూ బలవంతం చేయలేరని అన్నారు. మరో వైపు గెహ్లాట్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటు సచిన్‌ పైలట్‌ను సీఎంగా వచ్చే రాజస్థాన్‌ ఎన్నికల బరిలోకి దింపనున్నది. ఇటు విధేయుడికి పార్టీలో కీలక పదవిని కట్టబెట్టడంతో పాటు రాజస్థాన్‌ నేతల్లో ఉన్న అసంతృప్తి నేతలకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.