పాము కాటుకు గురై ఎంపిటిసి మృతి
రొంపిచర్ల మండలంలో మాచవరం ఎంపిటిసి అంబటి వెంకటరత్నం (35) పాము కాటుకు గురై బుధవారం మృతి చెందారు. ఆ గ్రామానికి చెందిన ఎంపిటిసి వెంకటరత్నం తన పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా పాము కరవటంతో నోటి నుంచి నురగలు వచ్చి పడిపోయారు. అక్కడ పనులు చేస్తున్న కూలీలు గమనించి ఆటోలో నరసరావుపేటలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంపిటిసిగా గ్రామస్తులకు విశేషమైన సేవలు అందిస్తున్న వెంకటరత్నం మృతి బాధాకరమని అన్నారు. కాగా మృతురాలికి భర్త, ఇరువురు కుమారులు ఉన్నారు. కుమారులలో ఒకరు కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.