షేర్ మార్కెట్ పేరిట 5 కోట్లు మోసం
షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో లక్షలాది రూపాయలను సంపాదించవచ్చంటూ ఆశ చూపి 5 కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఇద్దరిని చెంగల్పట్టు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా… మరైమలర్ నగర్ ప్రాంతానికి చెందిన శివశంకరి (32) అనే మహిళ గత నెల 23న తాంబరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేసింది. అందులో తమ ఎదురింటిలో నివసించే కామాక్షితో పాటు ఆమె భర్త, మామ, మరిది షేర్ మార్కెట్‌లో డబ్బు పెట్టడం వల్ల తక్కువ కాలంలో రూ.లక్షల్లో సంపాదించవచ్చని తనను నమ్మించారని పేర్కొంది. వారి మాటలు నమ్మిన శివశంకరి ముందు రూ.16.50 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. అనంతరం ఆమె కుటుంబం రూ. 5కోట్ల వరకు శివశంకరి కుటుంబ సభ్యులకు అందించినట్లు వివరించింది. అయితే ఒకేఒక్కసారి మాత్రమే డివిడెంట్ రూపంలో రూ.50 వేలు ఇచ్చారని, ఆ తర్వాత పైసా కూడా చెల్లించలేదని పేర్కొంది. దీనిపై విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కమిషనర్ ఆదేశం మేరకు కేసు నమోదు చేసిన క్రైంబ్రాంచ్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో కామాక్షి కుటుంబం రూ.5 కోట్ల మేర మోసం చేసినట్టు తేలింది. దీంతో పోలీసులు కామాక్షితో పాటు, విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.