సుభాష్‌చంద్ర‌బోస్‌ని ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర‌దృష్టం: కాట్ర‌గ‌డ్డ‌

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా పాత సనత్ నగర్ నియోజకవర్గం లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సమీపంలో సుభాష్ మార్గ్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చెత్తాచెదారం చూసి చలించిపోయిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, సూర్యదేవర లత గారు, వెనువెంటనే సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి ఉన్న బూజును మరియు విగ్రహం చుట్టూ ఉన్న చెత్తాచెదారం అన్నం మెతుకులు అన్నిటిని చీపురులతో శుభ్రం చేసి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసూన గారు మాట్లాడుతూ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న శుభ తరుణంలో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఇలా చూడటం బాధాకరం అని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు లక్షలకు, లక్షలు ఖర్చుపెట్టి కేవలం పేపర్లలో ప్రకటనలకు మాత్రం పరిమితం అవుతున్నారని, స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను మాత్రం గాలికి వదిలేసి వారిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రసూన గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, రాంగోపాల్ పేట్ డివిజన్ అధ్యక్షులు ఎం రాజు, స్థానిక డివిజన్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.