సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ప్రాంగణంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు ఉచితంగా మధుమేహ, కంటి, ఈఎన్‌టీ వైద్య పరీక్షలు చేసి, సలహాలు, సూచనలు అందించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ శిబిరానికి సుమారు 100 మంది వరకు రోగులు వచ్చారు. వారందరికీ ఉచితంగా మూడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. డైటీషియన్ కన్సల్టేషన్ కూడా అందించారు. మధుమేహం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏవి తినకూడదన్న విషయాలను వివరంగా చెప్పారు. మధుమేహం స్థాయి తీవ్రంగా ఉండి, పేదరికం వల్ల తరచు పరీక్షలు చేయించుకోలేని కొంతమంది రోగులకు ఇంటివద్దే మధుమేహ పరీక్షలు చేసుకోడానికి వీలుగా ఉచితంగా గ్లూకోమీటర్లు అందించారు. ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ వై. చిరంజీవిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి. ఆస్పత్రి ఆఫ్తల్మాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కాడా సత్యనారాయణ నేతృత్వంలో సిబ్బంది పాల్గొని, వచ్చిన రోగులందరికీ కంటి పరీక్షలు నిర్వహించారు. కళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. అలాగే, ప్రపంచ ప్రఖ్యాత ఈఎన్‌టీ, స్కల్‌బేస్ సర్జన్ డాక్టర్ టి.నారాయణన్ జానకిరామ్, ఆ విభాగానికి చెందిన ఇతర వైద్యులు పాల్గొని ఉచితంగా వినికిడి పరీక్షలు చేశారు. చెవి, ముక్కు, గొంతులకు సంబంధించిన సమస్యలకు అవసరమైన ఇతర పరీక్షలు కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ, “ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనందరం స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నాం. ఈ స్వాతంత్య్ర ఫలాలు అనుభవించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా ఇటీవలి కాలంలో చాలామందిని మధుమేహం వేధిస్తోంది. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడంతో పాటు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని అదుపులో ఉంచుకోగలం. ఆహార నియమాలు పాటించడం, తగినంతగా శారీరక వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్ల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలనూ ఎప్పటికప్పుడు పట్టించుకోవాలి. పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే మనిషికి సంపూర్ణ స్వాతంత్య్రం ఉన్నట్లు. సెంచురీ ఆస్పత్రి కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.