వృద్దుడి కాలిలో అతిపెద్ద కణితిని తొలగించిన ఎస్ఎల్‌జీ వైద్యులు
నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో.. అసాధారణ వ్యాధితో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా చికిత్స అందించారు. ఈ చికిత్స చేయకపోతే అతడి కుడికాలు తీసేయాల్సి వచ్చేది.
హైదరాబాద్‌కు చెందిన వెంకటరెడ్డి కుడికాలు బాగా వాచిన పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చారు. అది గత కొన్ని వారాలుగా బాగా పెరుగుతూ, తీవ్రమైన నొప్పిని కలిగిస్తోంది. దానివల్ల ఫలితంగా నడకలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
అవసరమైన స్కాన్లు, ఇతర పరీక్షలు చేయగా తొడ మధ్య, వెనక భాగాల నుంచి మొదలైన 30 x18 సెంమీ పరిమాణంలో ఒక కణితి లాంటిది ఉన్నట్లు తేలింది. ఇది కాలి కిందిభాగం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసే ఫెమోరల్ నాళాలకు చాలా దగ్గరగా ఉంది.
ఈ కేసు గురించి, తాము చేసిన చికిత్స గురించి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలిజస్టు డాక్టర్ శ్రీకాంత్ సోమ మాట్లాడుతూ, “రోగి కాల్లో ఉన్న కణితిని తొలగించేందుకు వెంటనే తగినంత మార్జిన్లు చూసుకుని శస్త్రచికిత్స చేశాం. కొన్ని గంటల పాటు జాగ్రత్తగా కణితిని తొలగించిన తర్వాత అతడి కాలి కిందిభాగంలో ఉన్న నరాలన్నింటినీ జాగ్రత్తగా కాపాడగలిగాం. అదే సమయంలో కణితి మార్జిన్లలో వేటినీ వదల్లేదు. ఈ కణితి 4 కిలోల బరువుంది. దానికి హిస్టోపాథలాజికల్ పరీక్షలు చేయించగా, అది ప్లెమార్ఫిక్ లైపోసర్కోమా అని తేలింది. అంటే.. శరీరంలోని కొవ్వుకణాల నుంచి ఆ కణితి ఏర్పడింది. శస్త్రచికిత్స తర్వాత గాయం త్వరగా మానిపోయింది. దాంతో రోగికి రేడియేషన్ థెరపీ చేయాలని సూచించాం. ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో రోగి బాగానే నడవగలుగుతున్నారు. కణితి మరోసారి రాకుండా ఉండేందుకు రోగిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం” అని వివరించారు.
ఇలాంటి చాలా సందర్భాల్లో రోగుల ప్రాణాలను కాపాడటానికి కాలు తీసేయాల్సి వస్తుంది. కానీ ఈ కేసులో మాత్రం ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు ఫెమోరల్ నాళాలను సంరక్షిస్తూనే, కణితి మార్జిన్లన్నింటినీ పూర్తిగా తొలగించడండలో విజయం సాధించారు. ఫలితంగా, కాలును పూర్తిస్థాయిలో పునరుద్ధించారు. తొలగించాల్సిన అవసరం లేకుండా చూశారు.