ప్రాణ‌దాత చ‌రిత కుటుంబాన్ని అభినందించిన జ‌గ‌ప‌తిబాబు

  • ఏడు వసంతాల త‌ర్వాత సంతానం
  • బిడ్డ‌ను త‌నివితీర‌న చూడ‌కుండానే మ‌ర‌ణం
  • అవ‌య‌వ‌దానంకి ముందుకు వ‌చ్చిన కుటుంబం
  • అవ‌య‌వాలు బూడిద‌కానివ్వ‌కండి – జ‌గ‌ప‌తిబాబు

పెళ్లి జ‌రిగి ఏడు సంవత్స‌రాలు పూర్తైయిన సంతానం క‌ల‌గ‌లేదు. దేవుడి అనుగ్ర‌హంతో ఏడు సంవ‌త్స‌రాల త‌రువాత ఆ ఇంట్లో పండంటి మ‌గ బిడ్డ జ‌న్మ‌నిచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిల‌వ‌లేక‌పోయింది. ప‌చ్చిబాలింత‌కు నెల రోజులలోపు ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చి బ్రెయిన్ డెడ్ అయింది. అయితే త‌ను అమ్మ‌గా మ‌ర‌ణించినా… ఇంకా ముగ్గురిలో జీవించే ఉంది. పుట్టుడె దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం స‌హ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకుంది. గద్వాల్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల చ‌రిత బ్రెయిన్ డెడ్‌తో జూలై 2వ తేదీన‌ మ‌ర‌ణిచారు. ఆమె అవ‌య‌వాల‌తో మ‌రో ముగ్గురికి ప్రాణదానం చేశారు ఆమె కుటంబ స‌భ్యులు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న ప్ర‌ముఖ సినీ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఆ కుటంబ స‌భ్యుల‌ను అభినందించ‌డానికి గ‌ద్వాల్ వ‌చ్చారు.

ఈ మేర‌కు గురువారం గ‌ద్వాల్ గంజిపేట‌లోని ఓ స్టార్ ఫంక్ష‌న్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. ఆయ‌న‌తో పాటు గ‌ద్వాల్ నియోజ‌వ‌ర్గ ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, క‌లెక్ట‌ర్ హ‌ర్ష, ఎస్పీ రంజ‌న్ ర‌త‌న్ కుమార్‌, జెడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ స‌రిత‌, మున్పిప‌ల్ ఛైర్మ‌న్ కేశ‌వ్‌, డిఎంహెచ్ఓ & కార్పొరేట‌ర్‌ కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు వైద్యులు డా. గోవ‌ర్థ‌న్ రెడ్డి, డా. అనంత‌రావు, డా. మ‌నోజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా సినీ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు మాట్లాడారు. అమ్మ ప్రేమ‌ను ఎవ్వ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు. అది చెర‌ప‌లేని స‌త్యం. అమ్మ‌గా జీవిస్తూనే… తాను ఇబ్బంది ప‌డుతూ పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ఆరాట‌ప‌డుతుంది. ఇక్క‌డ మాత్రం 30 ఏళ్ల చ‌రితకు పెళ్లి అయ్యాక ఏడేళ్ల‌కు సంతానం క‌లిగింది. కానీ ఆ ఆనందాన్ని తాను ఆస్వాధించ‌కుండా… కుటుంబాన్ని పుట్టెడు దుఃఖంలో నింపి కానారాని లోకానికి వెళ్లిపోయింది. అయినా కానీ ఒక అమ్మ‌గా ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింది. ఇదే క‌దా అమ్మ ప్రేమ‌. ఎన్ని జ‌న్మ‌లెత్తిన ఆ అమ్మ‌కు ఎలా రుణం తీర్చుకోగ‌లం మ‌నం. దుర‌దృష్టవాశాత్తూ మ‌ర‌ణించిన అవ‌య‌వాల‌ను బూడిద పాలు చేయకండి. అవ‌య‌వ‌దానంపై అవ‌గాహ‌న పెంచుకొని అవ‌య‌వాల‌ను దానం చేయాలి. అన్నింటికంటే అవ‌య‌వ‌దానం ప్ర‌తిజ్ఞ అయితే మ‌రింత‌మందికి స్ఫూర్తి క‌లిగిస్తుంది. గుండె, ఊపిరితిత్తులు, మూత్ర‌పిండాలు, కాలేయం, క‌ళ్లు, చ‌ర్మం, చేతులు.. ఇలా ఎన్నో ర‌కాల అవ‌య‌వాల‌ను మ‌ర‌ణానంత‌రం వేరేవారికి అమ‌రిస్తే వాళ్ల‌కు కొత్త జీవితం ల‌భిస్తుంది. త‌న అభిమానులంతా అవ‌య‌వ‌దానం చేయ‌డానికి ముందుకురావాల‌ని జ‌గ‌ప‌తిబాబు పిలుపునిచ్చారు. దీనివ‌ల్ల మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా అమ‌రులుగా మిగిలిపోతార‌ని చెప్పారు.

అవ‌య‌వ‌దానం అద్వితీయం
త‌మ‌కు అయిన‌వాళ్ల ప్రాణాలు పోతున్నాయ‌ని తెలిసి, అదే స‌మ‌యంలో బాధ‌ను దిగ‌మింగుకుని మ‌రికొంద‌రి ప్రాణాలు నిల‌బెట్టేందుకు ముందుకు రావ‌డం చాలా సాహ‌సోపేత‌మైన నిర్ణ‌య‌మ‌ని నియెజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్ రెడ్డి అన్నారు.

మ‌ర‌ణానంత‌రం శ‌రీరాన్ని య‌థాత‌థంగా ద‌హ‌నం లేదా ఖ‌న‌నం చేయ‌డం కంటే, అవ‌య‌వ‌దానం చేస్తే వాటిద్వారా ప్రాణాలు నిల‌బెట్టుకున్న‌వారిలో త‌మ‌వారిని చూసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్
హ‌ర్ష‌ అన్నారు.

అవ‌య‌వ‌దానం నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎంతో సాహ‌సోపేత‌మ‌ని, వారి కుటుంబ స‌భ్యుల స్ఫూర్తితో మ‌రింత మంది ముందుకు రావాల‌ని జిల్లా ఎస్పీ రంజ‌న్ ర‌త‌న్ కుమార్ అన్నారు. రోడ్డు ప్ర‌మాదాల్లో ఎక్కువ మంది త‌క్ష‌ణ మ‌ర‌ణాల‌తో పాటు ఎక్కువ‌గా బ్రెయిన్ డెడ్ అవుతారు అలాంటి వారు ముందుకు వ‌చ్చి అవ‌యవాలు దానం చేయాల‌ని కోరారు.

డెల‌వ‌రీ అయిన నెల రోజుల త‌ర్వాత ఫెరిపాటం స‌మ‌స్య వ‌చ్చింది వెంట‌నే క‌ర్నూలు కిమ్స్ హాస్పిట‌ల్‌కి తీసుక‌వ‌చ్చారు. వైద్య‌లు ఎంతో శ్ర‌మించినా… దుర‌దృష్టావాశాస్తూ ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. కాగా ఆమె నుండి సేక‌రించిన కిడ్నీలు, లివ‌ర్‌తో ముగ్గురు ప్రాణాలు కాపాడ‌గ‌లిగాం. లివ‌ర్ ఎన్ఆర్ఐ హాస్పిట‌ల్‌కి, ఒక కిడ్నీ నెల్లూరులోని ఆపోల్ ఆస్ప‌త్రికి గ్రీన్ ఛానెల్ ద్వారా త‌ర‌లించాం. మ‌రో కిడ్నీని కిమ్స్ హాస్పిట‌ల్ క‌ర్నూలో ఓ వ్య‌క్తికి మార్పిడి చేశామ‌ని కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు డాక్ట‌ర్‌. గోవ‌ర్ధ‌న్ రెడ్డి తెలిపారు.