ఇరాక్ బాలికలకు కిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్సలు
- ఆర్ధిక సాయాన్ని అందించింన ఇరాక్ ప్రభుత్వం
- సంక్లిష్టమైన కేసులో విజయవంతంగా శస్త్రచికిత్స
ఖండాలు దాటి తమ ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం కోటి ఆశలతో వచ్చిన ఓ తల్లికి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఊరట కల్పించారు. ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరానికి చెందిన దంపతులకు 14, 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ గూని సమస్య చాలా తీవ్రంగా ఉంది. నడుము పైభాగం శరీరం నుంచి దూరంగా వెళ్లిపోవడం, నడకలో ఇబ్బంది, ఊపిరి అందకపోవడం, విపరీతమైన నడుంనొప్పితో పాటు.. చూసేందుకు శారీరక అవకరం కూడా చాలా ఎక్కువగా ఉండేది. పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు ఈ సమస్యను తల్లిదండ్రులు గమనించారు. అప్పటికి అది చాలా కొద్దిస్థాయిలోనే ఉంది. దాంతో చికిత్స కోసం బాగ్దాద్ నగరంలోని వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వాళ్ల వెన్నెముకలకు ఎక్స్-రే తీసి చూడగా.. అది చాలా సంక్లిష్టమైన, పుట్టుకతోనే వచ్చే గూని అని గుర్తించారు. అందులో వెన్నెముకలోని ఎముకలు మెలితిరిగి ఊపిరితిత్తులు, గుండెపై ఒత్తిడి కలిగిస్తున్నాయి. ఈ సమస్య వయసుతోపాటే బాగా పెరుగుతూ వచ్చింది. పిల్లలిద్దరికీ వెన్నెముక ఏర్పడే తీరులోనూ సమస్యలున్నాయి.
పలువురు వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులను తల్లిదండ్రులు కలిశారు. కానీ, శస్త్రచికిత్స చేస్తే వెన్నెపాము (స్పైనల్ కార్డ్)కు గాయం అయ్యే ప్రమాదం ఎక్కువని.. దానివల్ల రెండు కాళ్లకు పక్షవాతం రావడం, బ్లాడర్ నిండినా తెలియకపోవడం లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పడంతో హతాశులయ్యారు. వెన్నెముకకు తొడిమలు చాలా చిన్నగా ఉండటంతో వాటినుంచి మెటల్ స్క్రూలు అమర్చడం కూడా కష్టమేనన్నారు. అందువల్ల శస్త్రచికిత్స చేసినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని అక్కడి వైద్యులు చెప్పారు.
ఎక్కడ చూసినా నిరాశే మిగలడంతో.. చిట్టచివరగా ఆ తల్లిదండ్రులు తమ పిల్లలిద్దరినీ తీసుకుని హైదరాబాద్ వచ్చి, కిమ్స్ ఆస్పత్రిలో చూపించారు. అప్పటికి వాళ్ల భుజాలు దాదాపు నడుం వరకు వచ్చేశాయి, వీపు మీద పెద్ద మూపురం ఏర్పడింది, ఎదభాగం ముందుకు పొడుచుకుని రావడంతో పాటు, పొట్ట లోపలకు వెళ్లిపోయింది. నడుస్తుంటేశరీరంలో పైభాగం ఒక పక్కకు వెళ్లిపోతోంది. మెలితిరిగిన పక్కటెముకలు, వెన్నెముక ఎముకల వల్ల ఊపిరితిత్తులకు కావల్సినంత స్థలం లేకపోవడంతో.. ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతోంది. సరైన చికిత్స చేయకపోతే వారి జీవితకాలం కూడా తగ్గే ప్రమాదముంది.
హైదరాబాద్‌లో కిమ్స్ ఆస్పత్రిలో వెన్నెముక అవకరాలను నయం చేయడంలో అపార అనుభవం ఉన్న డాక్టర్ సురేష్ చీకట్ల గురించి, ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు.. ఓ-ఆర్మ్, న్యూరో మానిటరింగ్, స్పైనల్ నేవిగేషన్ లాంటి వాటి గురించి విని, ఇక్కడకు తీసుకొచ్చారు. ఇక్కడ పిల్లలిద్దరికీ ఎక్స్-రేలు, హోల్ స్పైన్ సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేయగా, వారిద్దరికీ పుట్టుకతోనే వచ్చే డోర్సల్ కైఫోస్కోలియోసిస్ అనే సమస్య ఉందని, వారిలో ఒకరికి వెన్నెముక కూడా సరిగా లేదని తేలింది.
దాదాపుగా 150 డిగ్రీల కంటే ఎక్కువుగా వంపు కలిగి ఉన్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను కిమ్స్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ సురేష్ చీకట్ల వివరించారు.
ఇంత సంక్లిష్టమైన స్కోలియాసిస్ కేసుకు చికిత్స చేయడం మాకు పెద్ద సవాలుగా మారింది. దీనికి సాధారణంగా 6 నుంచి 8 గంటలకు పైగా సమయం పడుతుంది. దాంతో అన్ని దశల్లోనూ ముందుగా కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాం. శస్త్రచికిత్సకు ముందే గుండె వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల విషయంలో పల్మనాలజిస్టులు, న్యూరో ఫిజిషియన్, న్యూట్రిషనిస్టు, ఫిజియోథెరపీ నిపుణులందరి అభిప్రాయాలు తీసుకున్నాం. పిల్లల వయసు దాదాపుగా వెన్నెముక ముదిరే స్థాయికి రావడంతో పాటు, వాళ్ల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో.. శస్త్రచికిత్స ఖర్చును గణనీయంగా తగ్గించేలా చూశాం. ఇందుకోసం ఆపరేషన్‌కు ముందు, చేసే సమయంలోనూ కచ్చితంగా ప్లాన్ చేసి, ఒకే దశలో వారి అవకరాన్ని తగ్గించేలా చూశాం. ముందుగా వెన్నుముక ఎముకలోనికి స్క్రూలను పంపించాం. వెన్నుముక వంపు ఎక్కువగా ఉన్న మద్యభాగంను (అపెక్స్) గూని మరియు వంపును సరిచేయడానికి ఆస్టియాటమి (ఎముకలో కొంతభాగం తీసివేయడం) పద్దతిలో చేశాం. స్క్రూల ద్వారా సపోర్టింగ్ రాడ్స్‌ని అమర్చాం. పక్కటెముకలు కూడా విపరీతంగా లోపలికి చొచ్చుకుని వంపును కలగజేయడంతో, ఎత్తు ఎక్కువగా ఉన్న వైపున కొన్ని పక్కటెముకలను కూడా వెన్నముకకు అతుక్కున్న ప్రాంతం నుంచి థోరకోప్లాస్టి పద్దతిలో విడదీశాము. వెన్నెముక వంపు చాలా ఎక్కువగా ఉండటం, వెన్నుపాములో సిరింక్స్ కూడా సమస్య ఉండటం వల్ల గూని, వంకర సరిచేయడం సమస్యాత్మకంగా మారింది. సరిచేయడానికి చాలా జాగ్రత్తగా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ సహాయంతో కొద్ది కొద్దిగా వంపును సరిచేస్తూ వెన్నుపాముపై ఒత్తిడి పడకుండా వీలైనంత వరకు వెన్నుముక వంకర, వంపును ఎటువంటి సమస్యలు లేకుండా సరిచేయగలిగాం. ఎనస్థీషియా నిపుణుడు డాక్టర్ నరేష్‌కుమార్ నేతృత్వంలోని బృందం మద్దతుతో ఈ శస్త్రచికిత్స చేశారు. ఈ పిల్లలకు పుట్టుకతోనే ఇలాంటి సమస్య వచ్చింది. అత్యంత అరుదుగా ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. కానీ ఒకే కుటుంబంలో ఇలా ఇద్దరికి ఒకే సమస్య రావడం చాలా అరదైనది.
ఇక ఈ ఆపరేషన్ అయిన మొదటిరోజే పిల్లలిద్దరినీ నడిపించాం. కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉన్న స్పైనల్ రీహాబిలిటేషన్ బృందం ఇందుకు సమర్థంగా పనిచేసింది. ఆపరేషన్ అయిన ఐదోరోజునే పిల్లలిద్దరినీ పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి చేయగలిగాం అని డాక్టర్ సురేష్ చీకట్ల వివరించారు. కాగా, నిరుపేద కుటుంబానికి చెందిన ఈ బాలికల శస్త్రచికిత్సకు అయిన వ్యయాన్ని ఇరాక్ ప్రభుత్వం స్పాన్సర్ చేసింది.