మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: సీఎం జగన్
మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు మరింత ముందుకురావాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని సీఎం జగన్ అన్నారు. సచివాలయంలో 210వ రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్.ఎల్.బీ.సీ)సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశం సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ నవోదయం పధకం కింది ఎంఎస్‌ఎంఈలకు, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ ఒకటిలో ఉన్న ఆరు జిల్లాల్లో ఒకలా, మిగిలిన ఏడు జిల్లాలో ఇంకోలా వడ్డీరేట్లు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు.
బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయని సీఎం జగన్ అన్నారు.12.5 శాతం, 13.5 శాతం ఇలా వసూలు చేసుకుంటూ పోతున్నారని, వడ్డీరేట్ల విషయలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వేయడం ఆలోచించదగ్గ విషయన్నారు. వైయస్సార్ కడప జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలుచేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామాల ఆర్థిక వ్యస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు