బంగ్లా బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సంజయ్‌ బంగర్‌?

అన్నీ అనుకున్నట్లు జరిగితే టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ను జూన్‌లో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టుకు టెస్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా చూడొచ్చు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌(బీసీబీ) సంజయ్‌ బంగర్‌ను టెస్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా తీసుకోవాలనే యోచనలో ఉంది. ‘ మేము సంజయ్‌ బంగర్‌తో ఈ విషయమై చర్చించాము.. కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ బంగర్‌ రాలేని అవకాశం ఉంటే మిగతావాళ్లతో కూడా టచ్‌లో ఉంటాము’ అని బీసీబీ ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌ నిజాముద్దీన్‌ చౌదరీ పేర్కొన్నాడు. (టెస్టు చాంపియన్‌షిప్‌పై వకార్‌ యూనిస్‌ అసంతృప్తి)

కాగా ఇప్పటికే బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్‌ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్‌ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్‌ బంగర్‌ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలసిందే. ఒకవేళ బంగర్‌ బంగ్లా జట్టుకు టెస్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా వస్తే మాత్రం జూన్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు కొనసాగే అవకాశం ఉంది.