చర్మ క్యాన్సర్లతో జాగ్రత్త
డాక్టర్. ఎస్. మాధురి
కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్
కిమ్స్ ఐకాన్, వైజాగ్.
మన శరీరంలోని అతి పెద్ద అవయవం మన చర్మం. శరీరాన్నంతటినీ కప్పి రక్షణ కవచంలాగా ఉండటమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను కాపాడుతూ నీటిని, కొవ్వును నిల్వ ఉంచుతూ… విటమిన్ ‘డి’ తయారీకి ఉపయోగపడుతుంది. చర్మానికి వచ్చే ఇతర సమస్యలతో పాటు చర్మ క్యాన్సర్ కూడా ప్రజల్ని భయపెడుతోంది.
ఈ చర్మ క్యాన్సర్ గురించి ప్రపంచమంతటా తెలియజేయడానికి ప్రతి ఏడాది మే నెలను చర్మ క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు. ఈ నెలలో ఈ క్యాన్సర్‌పై వచ్చే ఇబ్బందులు వాటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతారు.
చర్మం పైన హెచ్‌పీవీ వైరస్ వల్ల ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపించే పులిపిరికాయలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కొంతమందిలో వాటంతట అవే రాలిపోయినా మరికొంతమందిలో శాశ్వతంగా ఉండిపోయి ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పులిపిరికాయలను కలిగించే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) క్యాన్సర్ కారకం కాదు. అలాగే సెక్సువల్ కాంటాక్ట్స్ వల్ల మర్మావయవాల వద్ద వచ్చే పులిపిరికాయలు కూడా క్యాన్సర్‌కు దారితీయవు. కానీ… హెచ్‌పీవీ 16, 18 మొదలైన వైరస్ రకాను అంకోవైరస్‌లుగా పేర్కొనవచ్చు. ఇవి ఎలాంటి పులిపిరికాయలను కలగజేయవు గానీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువ.
రంగు మారడం కనిపిస్తే జాగ్రత్త:
గడ్డ అయినా, పుట్టుమచ్చ అయినా మార్పులకు గురవుతూ, రంగు మారుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే… నిర్లక్ష్యం చేయకూడదు. లైపోమాలు ఎటువంటి నొప్పినీ కలగజేయవు. క్యాన్సర్ కణుతులు కూడా తొలిదశలో అస్సలు నొప్పి ఉండవు. కానీ పెరిగే కొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం చూపించడం వల్ల తీవ్రమైన నొప్పిని కలగజేయటంతో పాటు చికిత్సకు అంత తొందరగా లొంగవు. శరీరం మీద ఎక్కడైనా… అంటే… ముఖ్యంగా ఎండకు గురయ్యే శరీరభాగాల్లో చర్మం రంగులో మార్పుతో పాటు మానని పుండు, స్కిన్‌ప్యాచ్‌లా ఉండి రక్తస్రావం అవుతూ ఉంటే పరీక్షలు చేయంచుకోవడం మంచిది.
మన దేశవాసుల్లో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్‌క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ. పూర్తిగా నయం చేయదగిన ఈ క్యాన్సర్ ప్రధానంగా ‘బేసల్‌సెల్ కార్సినోమా’, ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అని రెండు రకాలుగా ఉంటుంది. దాదాపు 90 శాతం బేసల్‌సెల్ కార్సినోమా రకానికి చెందినవే ఉంటాయి.
లక్షణాలు
చర్మ క్యాన్సర్ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది. స్కిన్ క్యాన్సర్ ప్రధానంగా చర్మం, ముఖం, పెదవులు, చెవులు, మెడ, ఛాతీ, చేతులు మరియు మహిళల్లో కాళ్ళతో సహా సూర్యరశ్మికి గురైన చర్మంపై అభివృద్ధి చెందుతుంది. స్కిన్ క్యాన్సర్ ముదురు రంగులతో సహా అన్ని స్కిన్ టోన్‌ల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది.
బేసల్‌సెల్ కార్సినోమా సంకేతాలు మరిము లక్షణాలు
బేసల్ సెల్ కార్సినోమా సాధారణంగా మెడ లేదా ముఖం వంటి, శరీరంలోని సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాల్లో సంభవిస్తుంది. మెలనోమా శరీరంలో ఎక్కడైన అభివృద్ధి చెందుతుంది. సాధరణ చర్మంలో క్యాన్సర్‌గా మారిన మోల్‌లో… మెలనోమా చాలా తరుచుగా ముఖం లేదా ప్రభావిత పురుషుల ట్రంక్ మీద కనిపిస్తుంది. మహిళ్లలో ఈ రకమైన క్యాన్సర్ చాలా తక్కువుగా కాళ్ళపై అభివృద్ధి చెందుతుంది.
ఇలా కనిపించవచ్చు
- ముత్యాల లేదా మైనపు బంప్
- చదునైన మాంసం – రంగు లేదా గోధుమ రంగు మచ్చ వంటి గాయం
- రక్తస్రావం లేదా స్కాబ్బింగ్ పుండు నయం కానప్పుడు తిరిగి వస్తుంది.
చికిత్స:
స్కిన్‌క్యాన్సర్స్ దాదాపు 100 శాతం నయమవుతాయి. క్యాన్సర్ వచ్చిన ప్రదేశాన్ని శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించడమే కాకుండా మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలనూ చంపివేయడానికి క్రయోవిధానంలో లేదా లేజర్‌తో చికిత్సలు చేస్తుంటారు. రేడియేషన్, కీమోథెరపీలను అవసరాన్ని బట్టి ఇస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగంలో మాత్రమే ఆయింట్‌మెంట్ రూపంలో పూతమందుగా కీమోథెరపీనీ ఇస్తారు. సర్జరీ చేసి చర్మాన్ని చాలా ఎక్కువగా తొలగించాల్సివచ్చినప్పుడు… ఇతర భాగాలనుంచి చర్మాన్ని సేకరించి, తొలగించిన చోట గ్రాఫ్టింగ్ చేస్తారు.
నివారణ:
ఎండ నేరుగా తగిలే భాగాల్లో పై పూతగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం, శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులూ, ఎండలోకి వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులూ, గొడుగు, చలువ కళ్లద్దాలు, టోపీలు ధరించడం, వీలైనంతవరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉండే ఎండలో బయటకు తిరగకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ క్యాన్సర్‌ను కొంతవరకు దూరంగా ఉంచగలిగినవాళ్లం అవుతాం. క్యాన్సర్ నివారణకే గాక … మామూలుగా కూడా చర్మసంరక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.