ఆవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్‌లో తొలిసారిగా టీఏవీఆర్ ప్రోసీజర్
నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ఆగ్నేయ హైదరాబాద్ ప్రాంతంలో తొలిసారిగా తాము టీఏవీఆర్ ప్రొసీజర్ చేసినట్లు ప్రకటించారు. అత్యంత నైపుణ్యం అవసరమైన ఈ ప్రొసీజర్ ద్వారా.. గత రెండేళ్లుగా గుండెకు సంబంధించి పలు రకాల సమస్యలతో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు కాపాడారు.
హైదరాబాద్ నగరానికి చెందిన రాఘవరావును మార్చి 14న అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అయనకు కరొనరీ ఆర్టెరీ డిసీజ్‌తో పాటు రుమాటిక్ హార్ట్ డిసీజ్ కూడా ఉంది. గత రెండేళ్లుగా ఈ సమస్యలకు వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో భాగంగా ఆయనకు పేస్‌మేకర్ పెట్టారు, టీఏవీఆర్, హెర్నియా సర్జరీ కూడా.. ఇవన్నీ ఆరు నెలల వ్యవధిలోనే చేశారు.
రోగి పరిస్థితి గురించి, తాము చేసిన చికిత్స గురించి అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ వి. ముకేష్ రావు మాట్లాడుతూ, “నడిచేటప్పుడు కళ్లు తిరగడం, ఊపిరి అందకపోవడం లాంటి సమస్యలతో రోగి ఆస్పత్రికి వచ్చారు. తగిన పరీక్షలు చేసిన తర్వాత ఆయన గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లే అయోటిక్ వాల్వు సన్నబడినట్లు గుర్తించాం. ఆయన వయసు, ఇప్పటికే చేసిన చికిత్సలను దృష్టిలో పెట్టుకుని టీఏవీఆర్ చేయాలని భావించాం. దానివల్ల సర్జరీ చేయకుండానే గజ్జల ద్వారా వెళ్లి అయోటిక్ వాల్వును మార్చగలం. సహజంగా ఉన్న వాల్వు స్థానంలో మేం ప్రపంచంలోనే అత్యుత్తమమైన‘సేపియన్ 3 ఎడ్వర్డ్స్ వాల్వు’ అమర్చాం. మార్చి 15న ఈ ప్రొసీజర్ చేయగా, రెండు రోజుల తర్వాత మార్చి 17న ఆయనను డిశ్చార్జి చేశాం” అని తెలిపారు.
“మా ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ నిపుణులు ఉండటంతో టీఏవీఆర్ చేయడంపై వెంటనే నిర్ణయం తీసుకోగలిగాం. సాధారణంగా అయితే ఇలాంటి కేసుల్లో సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేస్తారు. అనుభవంతో పాటు అపారమైన విజ్ఞానం ఉన్న వైద్యులు అందుబాటులో ఉండటం వల్ల.. రాఘవరావు కుటుంబసభ్యులకు కూడా నచ్చజెప్పడం సులభమైంది. దానివల్ల సమస్యను సమర్థంగా ఎదుర్కోగలిగాము. నగరంలోనే అత్యుత్తమమైన వైద్యుల బృందం మా ఆస్పత్రిలో ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాను అని” అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి సీఓఓ డాక్టర్ సత్వీందర్ సింగ్ సభర్వాల్ చెప్పారు.
అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలోనే ఏప్రిల్ నెలలో ఇదే రోగికి హెర్నియా కోసం మరో ప్రొసీజర్ చేశారు; ఆయన ఇప్పుడు అన్నిరకాల సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత 45 రోజులుగా ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పరిశీలించారు. పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారించడంతో.. ఆయన రేపు బయల్దేరి అమెరికా వెళ్తున్నారు. ఈ ప్రొసీజర్‌లో డాక్టర్ ముకేష్ రావుకు డాక్టర్ రాజీవ్ గార్గ్, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మలీంద్ర స్వామి, డాక్టర్ సంజీవరావు, డాక్టర్ సుదర్శన్ రావు, డాక్టర్ మోహన్, నర్సింగ్, ఇతర సహాయ సిబ్బంది సహకరించారు.