కేన్సర్ రోగికి కృత్రిమ పిత్తనాళం అమర్చిన డాక్టర్ రాజేంద్రప్రసాద్.
క్లోమం (పాంక్రియస్)లో కేన్సర్ సోకిన వ్యక్తి ప్రాణాలను నిలబెట్టేందుకు కర్నూలు కిమ్స్ వైద్యులు అత్యంత అరుదైన విధానంలో కృత్రిమ పిత్తనాళాన్ని అమర్చారు. ఈ వివరాలను కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎల్.రాజేంద్రప్రసాద్ వివరించారు.
‘‘అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల కృష్ణమూర్తికి క్లోమంలో కేన్సర్ వచ్చింది. ఆ కణితి క్లోమం నుంచి చిన్నపేగులోకి వచ్చింది. సాధారణంగా క్లోమ కేన్సర్ వచ్చినవారికి ఎండోస్కొపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ లేదా ఈఆర్సీపీ (ERCP)అనే పద్ధతిలో చికిత్స చేస్తారు. కానీ, ఈ కేసులో మాత్రం క్లోమం నుంచి చిన్నపేగులోకి కణితి రావడంతో ఈఆర్సీపీ సాధ్యపడలేదు. ఇలాంటి క్లిష్టమైన కేసుల్లో పొట్ట పైభాగం నుంచి కాలేయంలోకి ఒక డ్రెయిన్ ట్యూబును అమరుస్తారు. దానికి బయటివైపు పెట్టే బ్యాగులోకి ఫ్లూయిడ్స్ వస్తాయి. అలా బ్యాగ్ జీవితాంతం ఉంచుకుని అసౌకర్యంగా ఉండాల్సి వస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో పీటీబీడీ(PTBD) అంటారు.
ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఉండేందుకు ఎండోస్కొపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా పిత్తనాళానికి, పేగులకు మధ్య ఒక కృత్రిమ పిత్తనాళాన్ని (ఫుల్లీ కవర్డ్ మెటల్ స్టెంట్) అమర్చాము. ఆహారం జీర్ణం కావడానికి పిత్తం ఎంతో అవసరం. అందువల్ల అది బయటకు పోకూడదు. కృష్ణమూర్తి కేసులో అతడి జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యాధునిక పద్ధతిలో చికిత్స చేశాము. దీన్ని వైద్య పరిభాషలో ఈయూఎస్ గైడెడ్ కోలిసిస్టో డియోడినాస్టమీ ( EUS – CDS) అంటారు. ఆంధ్రప్రదేశ్లో అతి కొద్దిచోట్ల మాత్రమే ఈ తరహా చికిత్స చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఇదే తొలిసారి. ఈ చికిత్స అనంతరం రోగికి కామెర్లు పూర్తిగా నయం కావడంతో పాటు ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది. దాంతో అతడి జీవితకాలం పెరగడంతో పాటు.. జీవన నాణ్యత కూడా మెరుగుపడింది’’ అని డాక్టర్ రాజేంద్రప్రసాద్ చెప్పారు.