చిన్న పిల్లవాడికి గూని నుంచి విముక్తి

  • ఎన్ఐఏ అధికారి కుమారుడికి విజయవంతంగా శస్త్రచికిత్స
  • కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి వైద్యుల ఘనత

చిన్న వయసులో గూని రావడం చాలా బాధాకరంగా ఉంటుంది. శారీరక సమస్యకు తోడు సమాజంలోనూ చిన్న చూపు చూస్తారనే మానసిక సమస్య సైతం వారిని వేధిస్తుంది. శస్త్రచికిత్సతో దీన్ని నయం చేయవచ్చనే అవగాహన లేకపోవడం, సమస్య తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు గుర్తించకపోవడం వల్ల కొందరు ఈ సమస్యతో శాశ్వతంగా బాధపడుతుంటారు. పుట్టుకతోనే వెన్నెముక సరిగా ఏర్పడకపోవడం, లేదా వెన్నెముక సరిగా ఘనీభవించకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. సాంకేతికంగా అత్యంత నైపుణ్యంతో కూడిన హెమివెర్టిబ్రె రిసెక్షన్ అనే శస్త్రచికిత్సతో దీన్ని నయం చేయవచ్చు. కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఇలాంటి కేసులో అక్కడి కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కె.శ్రీకృష్ణ చైతన్య శస్త్రచికిత్స చేసి 13 ఏళ్ల బాలుడికి ఊరట కల్పించారు. ఆ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు.

“జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారి కుమారుడైన 13 ఏళ్ల బాలుడికి గూని సమస్యను గుర్తించిన తల్లిదండ్రులు.. కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి అతడిని తీసుకొచ్చారు. పుట్టుక నుంచి వీపు కొంత వంగి ఉంటోందని తెలిపారు. బాబును పరీక్షించగా, అతడి వెన్నెముకలో సమస్య ఉందని.. అది తప్ప వేరే సమస్యలేమీ లేవని తెలిసింది. దాంతో శస్త్రచికిత్స చేసి, అతడి వైకల్యాన్ని సరిచేయాలని నిర్ణయించాం. ఇటీవలే శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. అందులో భాగంగా వంకరపోయిన ఎముక భాగాన్ని పూర్తిగా తొలగించి, అవకరాన్ని సరిచేశాం. ఇవి చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు. ఇందులో ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నరం దెబ్బతినే అవకాశంతో పాటు ప్రాణాపాయం సైతం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇంట్రా ఆపరేటివ్ న్యూరల్ మానిటరింగ్ విధానంలో శస్త్రచికిత్స చేశాము. అనంతరం ఇప్పుడు ఆ బాబు పూర్తిగా కోలుకుని, ఎలాంటి నొప్పి లేకుండా నడవగలుగుతున్నాడు.

ఇంట్రా ఆపరేటివ్ న్యూరల్ మానిటరింగ్, 3డి ప్రింటింగ్
శస్త్రచికిత్స మొత్తం సజావుగా సాగేందుకు ప్రధానంగా రెండు పరికరాలు దోహదం చేశాయి. బాబు వయసును, అతడి వెన్నెముక తీరును బట్టి 3డి ప్రింటింగ్ విధానంలో స్క్రూలు సిద్ధం చేసుకున్నాం. ఇలాంటి శస్త్రచికిత్సల్లో వాడే ఇంప్లాంట్లు అన్నీ రోగి శరీర పరిమాణానికి సరిపోయేలా ఉండాలి. దీనికి తోడు శస్త్రచికిత్స జరగుతున్నంత సేపు ఎంఈపీ, ఎస్ఎస్ఈపీ, ఈఎంజీలను పరిశీలిస్తూనే ఉన్నాం. అందువల్ల శస్త్రచికిత్స సమయంలో ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే వాటిలో తెలిసిపోతుంది కాబట్టి తక్షణం దాన్ని సరిచేసే అవకాశం లభిస్తుంది. ఈ శస్త్రచికిత్సలో మత్తువైద్య నిపుణుల పాత్ర కూడా చాలా కీలకం. కిమ్స్ కొండాపూర్ ఆస్పత్రిలో ఉన్న ఎనస్థీషియా బృందం నైపుణ్యం వల్ల ఈ శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది” అని ఆయన వివరించారు.