‘ఎయిర్ ఇండియా వన్’కు అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ

భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణించే ‘ఎయిర్ ఇండియా వన్’ విమానాలకు మరింత పటిష్ఠమైన రక్షణ అందుబాటులోకి రానుంది. అత్యాధునికమైన క్షిపణి నిరోధక వ్యవస్థలను ఎయిర్ ఇండియా వన్ కోసం భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.

అమెరికా, భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సహకరించే ఈ విక్రయ ఒప్పందం అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతకు తోడ్పడుతుందని పెంటగాన్ అభిప్రాయపడింది.

లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ కౌంటర్‌మెజర్స్(ఎల్ఏఐఆర్‌సీఏఎం) సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్(ఎస్‌పీఎస్)గా పిలిచే క్షిపణి నిరోధక వ్యవస్థలను సుమారు 19 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1360 కోట్లు) ధరకు విక్రయిస్తున్నట్లు యూఎస్ డిఫెన్స్ సెక్యూరిటీ కోపరేషన్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది.