బాలింతకు కాలిలో గడ్డలు.. మందులు వాడకుండా నయం చేసిన వైద్యులు
ప్రసవం అయిన నెల రోజులకే కాలిలో రక్తం గడ్డకట్టి, కాలు బాగా వాచిపోయి, భరించలేని నొప్పితో బాధపడుతున్న బాలింతకు కొండాపూర్ కిమ్స్ వైద్యులు మందులు వాడకుండానే అరుదైన ప్రక్రియతో నయం చేసి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బొల్లినేని వివరించారు. “అనంతపురం జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళకు ప్రసవం అయిన సుమారు నెల రోజుల తర్వాత కాళ్లలో రక్తం గడ్డకట్టి విపరీతమైన వాపు (డీప్ వెయిన్ థ్రాంబోసిస్ – డీవీటీ) ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో బాగా శక్తివంతమైన ఇంజెక్షన్లు (ఆల్టిప్లేజ్) ఇచ్చి ఆ గడ్డలను కరిగిస్తాం. కానీ, బాలింతలకు అలాంటి ఇంజెక్షన్లు ఇస్తే.. వారికి బ్లీడింగ్ ఎక్కువై (పోస్ట్ పార్టం హెమరేజ్ – పీపీహెచ్) చివరకు గర్భసంచిని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగని గడ్డలను తొలగించకుండా అలాగే వదిలేస్తే తీవ్రమైన నొప్పి, వాపు అలాగే ఉండిపోతాయి. అవి ఆమె కదలడానికి వీల్లేకుండా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ గడ్డలు ఊపిరితిత్తులు లేదా గుండెలోకి వెళ్లి ప్రాణాపాయాన్ని కూడా కలిగించే ప్రమాదం లేకపోలేదు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతుంది. ఈ కేసులో కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న పెనంబ్రా యాస్పిరేషన్ కెథటర్ సిస్టం అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించాం. ఇది చాలా కొద్దిచోట్ల మాత్రమే అందుబాటులో ఉంది. దీనిద్వారా రక్తంలో గడ్డ మొత్తాన్ని సక్షన్ చేయగలిగాం. ఈ పద్ధతిలో థ్రాంబోలైజింగ్ ఏజెంట్ల (ఆల్టిప్లేజ్)ను ఉపయోగించకుండా, యాస్పిరేషన్ థ్రాంబెక్టమీ ద్వారా సమస్యను నయం చేశాం. తద్వారా బాగా శక్తిమంతమైన మందులు వాడాల్సిన అవసరం లేకుండా, కొద్దిపాటి మందులు మరియు సక్షన్ ద్వారానే మొత్తం తగ్గించగలిగాం. దాంతో కేవలం రెండు రోజుల్లోనే ఆమె కాలు బాగా వాపు, తీవ్రమైన నొప్పి మొత్తం తగ్గిపోయి దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది.
ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆమె కాలు బాగా వాచిపోయి, విపరీతమైన నొప్పితో ఉంది. దానివల్ల ఆమె సాధారణ జీవితం బాగా ప్రభావితమైంది. ఎక్కడకూ కదల్లేకపోవడం, పుట్టిన పాపను కనీసం దగ్గరకు తీసుకోలేకపోవడం, బిడ్డకు పాలివ్వలేకపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితి నుంచి ఆమె కాలు వాపు, తీవ్రమైన నొప్పిని తగ్గించడం వల్ల ఆమె మళ్లీ తన బిడ్డను దగ్గరకు తీసుకోగలిగారు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో నుంచి ఆమెను సాధారణ స్థితికి తీసుకురాగలిగాం” అని డాక్టర్ వెంకటేష్ బొల్లినేని వివరించారు.