లేకలేక పుట్టిన కవలలను కాపాడిన కిమ్స్ సవీర ఆస్పత్రి వైద్యులు
- అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రసవం
- నెలలు నిండని శిశువులకు ప్రాణదానం
- అన్ని విభాగాల వైద్యులు ఉండటమే అనుకూలం
ఆ దంపతులకు చాలాకాలంగా పిల్లలు లేరు. పిల్లల కోసం వాళ్లు తిరగని ఆలయాల్లేవు, వెళ్లని వైద్యుల్లేరు. 25 ఏళ్ల క్రితమే పెళ్లయింది గానీ, ఆ ఇంట పిల్లల సందడి లేదు. పిల్లల కోసం వాళ్లు చాలానే ఖర్చుపెట్టారు. ఆయన వయసు 50, ఆమె వయసు 42 ఏళ్లు ఉండగా.. ఎట్టకేలకు సంతానసాఫల్య చికిత్స ఫలించి, ఆమె కడుపు పండింది. లోపల పండంటి కవలలు పడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఆమెకు 28 వారాలకే నొప్పులు వచ్చాయి. ముందుగా తాడిపత్రిలో రెండు ఆస్పత్రులకు తీసుకెళ్తే, అప్పటికి ఇంకా నెలలు నిండలేదని… అందువల్ల అవి కాన్పునొప్పులు కాకపోవచ్చని చెప్పి పంపేశారు. అయితే, లేకలేక పిల్లలు పుడుతున్నారని, ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని ఆమె తండ్రి ముందుజాగ్రత్తగా అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అర్ధరాత్రి సమయం అయ్యింది. ఆస్పత్రిలో ఉన్న సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ ఉదయిని ఆమెను పరీక్షించగా… అప్పటికే కవలల్లో ఒకరి చేయి బయటకు వచ్చేసింది. ఆ సమయంలో వెంటనే ప్రసవం చేయకపోతే, పిల్లల ప్రాణాలకు ప్రమాదం అవుతుందని గుర్తించారు. తక్షణం మత్తువైద్య నిపుణుడిని, ఇతర సిబ్బందిని పిలిపించి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ప్రసవం చేశారు. పిల్లల్లో ఒకరి బరువు 1 కిలో, రెండోవారి బరువు 1.4 కిలోలు మాత్రమే ఉంది. దాంతో పిల్లలిద్దరినీ 40 రోజుల పాటు ఎన్ఐసీయూలో ఉంచారు. వాళ్ల ఊపిరితిత్తులు కూడా పూర్తిగా ఎదగకపోవడంతో అందుకు సంబంధించిన ఇంజెక్షన్లు ఇచ్చారు. ప్రాణాలు నిలబెట్టేందుకు పిల్లలిద్దరినీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. వైద్యుల కృషి ఫలించి, పిల్లలిద్దరూ పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. తర్వాత వారి బరువు 1.8, 2 కిలోల చొప్పున పెరిగింది. దాంతో వారిని డిశ్చార్జి చేశారు.
సాధారణ ఆస్పత్రులలో అన్ని విభాగాలకు చెందిన వైద్యనిపుణులు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండకపోవడం, అత్యాధునిక సదుపాయాలు లేకపోవడం లాంటి సమస్యల వల్ల ఇలాంటి క్లిష్టమైన కేసులకు చికిత్స చేయడం సాధ్యం కాదు. కానీ కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అనెస్థటిస్టు, పీడియాట్రిస్టు, గైనకాలజిస్టు, రేడియాలజిస్టు, ఎమర్జెన్సీ డాక్టర్ అందరూ ఉండటం, 24 గంటలూ అందుబాటులో ఉండటంతో తక్షణం ఇలాంటి క్లిష్టమైన కేసులకూ చికిత్స చేయడం, తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడటం సాధ్యమైంది. సాధారణంగా 36 వారాలు నిండిన తర్వాత మాత్రమే పిల్లలు పుడతారు. కానీ, ఈ కేసులో మాత్రం 28 వారాలకే.. అంటే 8 వారాల ముందుగానే ఆమెకు ప్రసవం అయ్యింది. నెలలు నిండకముందు పుట్టిన పిల్లల్లో రకరకాల సమస్యలు ఉంటాయి. అలాగే ఊపిరితిత్తులు వైఫల్యం చెందకుండా సరైన సమయంలో స్పందించి వాటి ఎదుగుదలకు మందులు ఇచ్చాం. ఇవాటన్నింటినీ అధిగమించేందుకు పిల్లల వైద్య నిపుణులు, ఎన్ఐసీయూ లాంటి విభాగాలు ఉండటంతో ఇద్దరు కవల పిల్లలతో పాటు వాళ్ల తల్లినీ కాపాడటం సాధ్యమైందని కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన డాక్టర్ మహేష్, డాక్టర్ ఉదయిని చెప్పారు.
ఈ సందర్భంగా తమ బిడ్డల ప్రాణాలు కాపాడి, ఎలాంటి సమస్యలు లేకుండా తమకు సురక్షితంగా అప్పగించినందుకు కిమ్స్ సవీరా యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.