బంగ్లాదేశీ పేషెంటుకు ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా చికిత్స‌

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో వైద్యులు బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన రోగికి విజ‌యవంతంగా చికిత్స చేశారు. అత‌డికి మూడునెల‌ల క్రితం జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో మోకాలు తీవ్రంగా దెబ్బ‌తింది. త‌న సొంత దేశంలో మూడు నెల‌ల పాటు ఎక్క‌డా స‌రైన చికిత్స దొర‌క్క‌పోవ‌డంతో నిపుణులైన వైద్యుల స‌ల‌హాలు, చికిత్స‌ల కోసం అత‌డిని హైద‌రాబాద్ తీసుకొచ్చారు.

రోగి ప‌రిస్థితి, అత‌డికి అందించిన చికిత్స గురించి ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ, “38 ఏళ్ల వ‌య‌సున్న ఎండి.ఎస్.ఎం. మ‌మునుల్ హ‌క్ అనే వ్య‌క్తికి ఓ ప్ర‌మాదంలో మోకాలు బాగా దెబ్బ‌తింది. దానికి సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ, బంగ్లాదేశ్‌లో అలాంటి శ‌స్త్రచికిత్స చేసే స‌దుపాయం ఎక్క‌డా అత‌డికి క‌నిపించ‌లేదు. దాంతో మూడు నెల‌లు దాటిన త‌ర్వాత‌, అత‌డిని ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. ఇక్క‌డ అత‌డి ప‌రిస్థితి ఎలా ఉందో వివిధ ప‌రీక్ష‌ల ద్వారా అంచ‌నావేసి, మోకాలు ఎంత గాయ‌ప‌డిందో తెలుసుకుని, దాన్ని న‌యం చేయ‌డానికి శ‌స్త్రచికిత్స చేశాం” అని తెలిపారు.

“శ‌స్త్రచికిత్స మొత్తం రెండు గంట‌లు ప‌ట్టింది. రోగిని అదే రోజు న‌డిపించాం కూడా! రోగి త్వ‌ర‌గా కోలుకోవ‌డంతో శ‌స్త్రచికిత్స జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత అత‌డిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఈ వారం మొద‌ట్లో అత‌డిని మ‌ళ్లీ ప‌రీక్షించాం. అత‌డు బాగా న‌డుస్తున్నాడు. దాంతో త‌న స్వ‌దేశం వెళ్లొచ్చ‌ని చెప్పాం” అని డాక్ట‌ర్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వివ‌రించారు.

భార‌త‌దేశంలో ఉన్న అంత‌ర్జాతీయ స్థాయి వైద్య స‌దుపాయాలు, సూప‌ర్ స్పెషాలిటీ వైద్యనిపుణుల వ‌ల్ల ప‌లు దేశాల నుంచి అంత‌ర్జాతీయ రోగులు వ‌స్తున్నారు. భార‌త‌దేశం, అందులోనూ హైద‌రాబాద్ న‌గ‌రం అందుబాటు ధ‌ర‌ల్లో వైద్య‌సేవ‌లు అందిస్తాయి. అత్యుత్త‌మ సంస్థ‌ల్లో మంచి శిక్ష‌ణ పొందిన‌, నిపుణులైన వైద్యులు ఉన్నారు. శ‌స్త్రచికిత్స‌లు చేయించుకోవ‌డానికి వేచి ఉండే స‌మ‌యం బాగా త‌క్కువ కావ‌డంతో హైద‌రాబాద్ మంచి వైద్య కేంద్రంగా మారింది.