కరోనా ఫోర్త్ వేవ్ మొదలైనట్టేనా ?
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైనట్టు అనిపిస్తోంది. ఇప్పటికే మూడు దశల్లో ప్రపంచాన్నిఅల్లకల్లోలం చేసిన కరోనా ఫోర్త్ వేవ్‌తో మళ్లీ ఇండియాలో అడుగుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో తాజా గణాంకాలను చూస్తే అదే పరిస్థితి కనిపిస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం కేసులు 40 రోజుల గరిష్ఠానికి పెరిగి 325కు చేరాయి. అంతక్రితం వారంతో పోలిస్తే.. గత వారంలో హోం ఐసొలేషన్ కేసుల సంఖ్య దాదాపు 48 శాతం పెరిగి 574కు చేరింది. ఏప్రిల్ 11 నాటికి మొత్తం 447 హోం ఐసొలేషన్ కేసులు ఉండగా.. మూడు రోజుల్లోనే (ఏప్రిల్ 14 నాటికి) మరో 127 మందికి కొవిడ్ నిర్ధారణ కావడంతో హోం ఐసొలేషన్‌లోకి వెళ్లారు. దీంతో హోం ఐసొలేషన్‌లో ఉన్న మొత్తం రోగుల సంఖ్య 574కు చేరింది. ఈ కేసుల సంఖ్య 500 మార్కును దాటి పైపైకి వెళ్తుండటాన్ని ఢిల్లీ సర్కారు సీరియ్‌సగా తీసుకుంటోంది. ఏప్రిల్ 1న 0.57 శాతమే ఉన్న కొవిడ్ పాజిటివిటీ రేటు.. 14వ తేదీ వచ్చేసరికి ఏకంగా 2.39 శాతానికి పెరగడాన్ని కూడా కీలకమైన పరిణామంగా పరిగణిస్తోంది. ఇటీవల ఢిల్లీలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బందికి కొవిడ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కారు అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనలను పాటించాల్సిదేనంటూ పాఠశాలలకు శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కొవిడ్ కేసులు బయటపడితే.. పాఠశాలలోని ఆ నిర్దిష్ట విభాగాన్ని లేదా తరగతి గదిని కొన్నిరోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. కేసుల సమాచారాన్ని బడులు వెంటనే విద్యాశాఖ డైరెక్టర్‌కు తెలియజేయాలని సూచించింది.