బీజేపీ వ‌ల్లే సీఎం రోడ్ల మీదకొచ్చి తిరుగుతున్నాడు : హైమా రెడ్డి

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ చేస్తున్న ఉద్య‌మాల వ‌ల్లే సీఎం ఫాం హౌస్ నుండి బ‌య‌టికి వ‌చ్చార‌ని అన్నారు బీజేపీ రాష్ట్ర నాయ‌కురాలు, మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి, మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హైమా రెడ్డి. ప్రగతి భవన్, ధర్నాచౌక్, ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతున్నారని, ఆ ఘనత భాజపాదేనన్నారు. రెండో రోజు పాదయాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ వెంట ఆమె పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. ఆర్డీఎస్ పథకాన్ని కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తానన్న ముఖ్యమంత్రి.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం లక్షా40వేల ఇళ్లిస్తే.. మోదీకి పేరొస్తుందని భయపడి రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ఎవరికీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. మిలియన్ మార్చ్​కు భయపడి కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. కేసీఆర్ మూర్ఖపు పాలన వల్ల రైతులు, నిరుద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని బండి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యబీమా ద్వారా నిరుపేదలు దేశంలో ఎక్కడైనా 5లక్షల వరకూ ఉచితంగా వైద్యం పొందవచ్చని, తెలంగాణలో ఆ పథకం అమలు కాకుండా కేసీయార్ అడ్డుకుంటున్నారన్నారు. శ్మశాన వాటికలు, రోడ్లు, మురికి కాల్వలు, కమ్యూనిటీ హాళ్లు, ఇళ్లు వీటన్నింటికీ కేంద్రం నిధులిస్తుంటే తెరాస సర్కారు పేర్లు మార్చి ప్రజలను ఏమార్చుతున్నారని వివరించారు. నిధులెవరిచ్చారో తెరాస సర్పంచ్​లు​, శాసనసభ్యులను నిలదీయాలన్నారు. అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగాన్ని మార్చి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు భాజపా అండగా ఉంటుందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటును అమ్ముకోకుండా భాజపాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు.