రాజకీయం కోసం రైతులను వాడుకుంటున్న సీఎం : కాట్రాగడ్డ ప్రసూన
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రాగడ్డ ప్రసూన. తన రాజకీయం పబ్బం గడపడానికి రైతులను ఎరగా వేసి వాడుకుంటున్నారని ఆరోపించారు. అంతేకానీ రైతులపై ఎటువంటి ప్రేమ లేదన్నారు. తెలంగాణలోని సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు దిగారని ఆరోపించారు.
కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు అని, తన రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారన్నారు. కమీషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఆయన వద్ద రాష్ట్రాలు తిరగడానికి, ఎన్నికల కోసం పార్టీకి వ్యూహకర్తలను నియమించుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ, వడ్లు కొనేందుకు, రైతులకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఉండవని మండిపడ్డారు.
మిల్లర్లతో కుమ్మక్కయిన కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసేసి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని… పాకిస్థాన్, శ్రీలంక దేశాల కంటే తెలంగాణ అప్పులే ఎక్కువని ఆమె పేర్కొన్నారు.