ఈసారి కూడా రోజాకు హ్యాండ్ ఇవ్వ‌నున్న జ‌గ‌న్న‌?

రోజా ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క మ‌హిళా నేత‌గా మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే వైకాపా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుండి ఆమెకు స‌ముచిత ప్రాధాన్యం ద‌క్క‌డం లేదు. మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నుకున్నారు. కానీ ఆమె ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అయితే ఇటీవ‌ల 24 మంది మంత్రుల‌ను రాజీనామ చేయించి కొత్త మంత్రి మండ‌లిని కూర్పుచేయాల‌నుకుంటున్నారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం జగన్ తన మనసు మార్చుకున్నారని.. పాత మంత్రుల్లో దాదాపు 10 మందిని మళ్లీ తన టీమ్ లోకి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందరూ కొత్తవారిని తీసుకుంటే ఎన్నికల నాటికి పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని.. అందుకే సీనియారిటీ, సమర్ధత ఆధారంగా 7 నుంచి 10 మందిని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మంత్రివర్గంలో కొనసాగేవారి లిస్టులో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, చెల్లుబోయిన వేణు, సీదిరి అప్పలరాజు, అంజాబ్ భాషా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఓ మహిళా మంత్రిని కూడా కొనసాగిస్తారన్న ప్రచారం జరుగుతున్నందున తానేటి వనిత గానీ, మేకతోటి సుచరితగానీ ఉండే చాన్సుందని తెలుస్తోంది.

ఇక వైసీపీలో అందరికంటే ముందుగా మంత్రి పదవిని ఆశిస్తున్న నగరి ఎమ్మెల్యే రోజాకు అమాత్యయోగం దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. సీనియర్లను కొనసాగిస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా ఆ జాభితాలో ఉంటారు. చిత్తూరు జిల్లా సమీకరణాల్లో పెద్దిరెడ్డి మంత్రివర్గంలో ఉంటే రోజాకు ఛాన్స్ ఉండదు. దీనిపై ఇప్పటికే రోజాకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు ఇస్తారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు రోజా మాత్రం గత వారం రోజులుగా మంత్రిపదవి దక్కాలని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. కాణిపాకం నుంచి కాశీ వరకు అన్ని ఆలయాలను చుట్టేశారామె. ఇదిలా ఉంటే రోజాకు పదవి గ్యారెంటీ అని.. మహిళల కోటాలో అయినా ఛాన్సుంటుందని ఆమె అభిమానులంటున్నారు.

రోజాను మంత్రివర్గంలోకి తీసుకొని హోం శాఖ ఇస్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఐతే రోజాను కేబినెట్లోకి తీసుకోకపోయినా హోం మంత్రి మాత్రం మరోసారి మహిళకే ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఐతే హోంమంత్రి అయ్యే మహిళా ఎమ్మెల్యే ఎవరనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎస్సీ మహిళ కోటాలో తానేటి వనిత, సుచరితలో ఒకర్ని కొనసాగించే అవకాశముండటంతో వాళ్లిద్దరిలో ఒకరికి హోం శాఖ ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎక్కువశాతం సుచరితకే ఆ పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల్సిందే మ‌రీ.