కారులో ఉన్న‌ది ష‌కీల్ కుమారుడే

జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించారు ఏసీపీ సుదర్శన్. ఘటన సమయంలో కారులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఉన్నాడని తేల్చేశారు. కేసుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ.. అన్ని వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే కుమారుడు రాహిల్‌ తో పాటు మరో ఇద్దరు అఫ్నాన్, నాజ్.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. తాము అదే రూట్‌ లోని సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించామన్నారు. ప్రమాద సమయంలో కారు డ్రైవ్ చేసింది అఫ్నాన్ అని తెలిపిన ఏసీపీ.. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఆఫ్నాన్ తోపాటు నాజ్ ను అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ఎమ్మెల్యే కుమారుడు రాహిల్ కోసం నాలుగు టీమ్‌ లతో గాలిస్తున్నామని తెలిపారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తునకు ఆటంకం కలిగించిందన్నారు సుదర్శన్.

శుక్రవారం ఓ వీడియో విడుదల చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌ కారు తనది కాదన్నారు. అప్పుడప్పుడు తాను ఉపయోగిస్తుంటానని అందుకే ఎమ్మెల్యే స్టిక్కర్‌ వేసినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారన్నారు. అయితే.. పోలీసులు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నారని తేల్చేశారు. దీంతో అతడ్ని తప్పించేందుకు ప్రయత్నాలు చేశారని ప్రతిపక్షాలు ఎమ్మెల్యేపై మండిపడుతున్నాయి. 17న రాత్రి జూబ్లీహిల్‌ రోడ్‌ నెంబర్ 45లో షకీల్ పేరు స్టిక్కర్ ఉన్నకారు.. వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో కాజల్‌ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లే అనే ముగ్గురు గాయపడ్డారు. అయితే.. కాజల్ చేతిలో ఉన్న రెండు నెలల పసికందు కిందపడి ప్రాణాలు కోల్పోయింది.